AP Government helpline numbers in New Delhi: మణిపూర్ లో చోటు చేసుకుంటున్న జాతి హింస చల్లారడం లేదు. భద్రతా బలగాలు, పోలీసులు మరో ఐదుగుర్ని కాల్చి చంపడంతో మరణాల సంఖ్య 54కి చేరుకుందని అధికారులు శనివారం ప్రకటించారు. ఈ హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో ఏపీ విద్యార్థుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. మణిపూర్‌లోని రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఏదైనా సహాయం అందించడానికి ప్రభుత్వం న్యూఢిల్లీలోని AP భవన్‌లో హెల్ప్‌లైన్ నెంబర్లు, కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. హెల్ప్‌ లైన్ నంబర్లు  011-23384016,   011-23387089
మణిపూర్ హింసలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు చిక్కుకున్నారు. తెలుగు విద్యార్థులు ఇంఫాల్ ఎన్ఐటీ సహా వేర్వేరు విద్యాసంస్థల్లో చదువుతున్నారు. హింస, కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులతో జనజీవనం స్తంభించింది. విద్యార్థులు హాస్టల్ గదులు, అద్దె గదుల్లో ఆహారం లేక అలమటిస్తున్నారని తెలుగు ప్రభుత్వాలు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంఫాల్ నుంచి కోల్‌కత్తాకు ఇండిగో అదనపు విమాన సర్వీసులు నడుపుతోంది. మణిపూర్ నుంచి ఇతర రాష్ట్రాల విద్యార్థులను తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 


హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సహాయాన్ని అందించడానికి మణిపూర్ ప్రభుత్వం, స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. మణిపూర్ రాష్ట్రంలోని ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నవారికి సహాయం అందించడానికి మణిపూర్ లో ఈ హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటుచేశారు. 
1. 8399882392 - ఎంఎన్ మైఖేల్ అకోమ్, IRS
2. 9436034077 - రెహనుద్దీన్ చౌదరి, జాయింట్ సెక్రటరీ (హోమ్)
3. 7005257760 - పీటర్ సలాం, జాయింట్ సెక్రటరీ (హోమ్)
4. 8794475406 - డాక్టర్ టీహెచ్. చరణ్‌జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ (హోం)
5. 8730931414 - డా. మయెంగ్‌బామ్ వీటో సింగ్, డిప్యూటీ సెక్రటరీ (హోమ్)
6. 7085517602 - ఎస్. రుద్రనారాయణ సింగ్, డీఎస్పీ (హోమ్)


మణిపూర్‌లో తమ పిల్లలు, విద్యార్థులు ఉన్నట్లయితే వారి తల్లిదండ్రులు న్యూ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా మణిపూర్ లో ఉన్న తమ పిల్లలకు సహాయం గురించి కోరవచ్చు అని ఓ ప్రకటనలో తెలిపారు. ఇంఫాల్‌లో, లేక న్యూఢిల్లీలో AP భవన్ హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించి, వారికి అవసరమైన ఏదైనా సహాయం కోరాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.


మణిపూర్ లో మెజార్టీ కమ్యూనిటీ అయిన మైతై (Meitei) వర్గాన్ని షెడ్యూల్‌ ట్రైబ్‌ ( ST)లలో చేర్చుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టు కూడా అంగీకారం తెలిపింది. కానీ దీనిపై ఒక్కసారిగా మైతై వర్గ ప్రజలు భగ్గుమన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల అల్లర్లకు దిగారు. హింస చెలరేగడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. దాదాపు 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్, చురచంద్‌పూర్, కంగ్‌పొక్పి ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణిపూర్ ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయింది. ఇంటర్నెట్ సర్వీస్‌లను బంద్ చేసింది. ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్ కూడా రాష్ట్రంలో మొహరించాయి. ఎలాంటి హింస చెలరేగకుండా నిఘా పెడుతున్నాయి. ఇప్పటికే ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించాయి. దాదాపు 7,500 మంది పౌరులకు ఆర్మీ షెల్టర్ ఇచ్చింది. కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు తరలించారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటికే అక్కడ 54 మంది చనిపోయారు.