మాజీ మంత్రి బాలినేని సొంత పార్టీలోనే పెద్ద బాంబు పేల్చారు. తనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని, పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నానంటూ ఆరోపించారు, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ లో కంటతడి పెట్టారు. బాలినేని చెప్పిందంతా నిజమే అయితే అధిష్టానం మరి ఏం చేస్తున్నట్టు..? ఆయమపై చాడీలు చెప్పేవారిని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా..? అందుకే ఇప్పుడు సైలెంట్ గా ఉంది. లేకపోతే తమకు అలాంటి ఫిర్యాదులేవీ లేవని, బాలినేనిపై తమకు ఎవరూ కంప్లయింట్ లు చేయలేదని కనీసం సజ్జల అయినా మీడియా ముందుకొచ్చేవారు. పైగా ఇప్పుడు బాలినేని విషయంలో రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది బాలినేనిపై వైసీపీ నిఘా పెట్టడం.
ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్లు ట్యాపింగ్ ఆరోపణలు
ఆమధ్య నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తనపై పార్టీ నిఘా పెట్టిందని, తన ఫోన్లు ట్యాప్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. నమ్మకం లేని చోట తాను ఇమడలేనంటూ బయటకొచ్చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం, ఆ దూరం ఇంకాస్త పెరగడం తెలిసిందే. అయితే అప్పట్లో కోటంరెడ్డి తనతోపాటు చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలపై నిఘా ఉందని, అయినా ఎవరూ బయటపడటం లేదని చెప్పారు. మరి బాలినేనిపై కూడా ఇప్పుడు నిఘా ఉన్నట్టే అనుకోవాలా..?
అధిష్టానాన్ని నేరుగా ధిక్కరించకపోయినా, కార్యకర్తలకోసం ఎందాకైనా పోరాటం చేస్తానంటూ బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే కార్యకర్తలకోసం పార్టీనైనా త్యాగం చేసే ఆలోచనలోనే ఆయన ఉన్నారు. ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటే పార్టీ చూస్తూ ఊరుకుంటుందా..? కచ్చితంగా బాలినేని కదలికలపై నిఘా పెడుతుంది. ఇప్పుడు జరిగుతుంది కూడా అదేనంటూ వార్తలొస్తున్నాయి. బాలినేని అసలు ఎవరెవరితో టచ్ లో ఉన్నారు. పార్టీ మారితే ఎటువైపు అడుగులేస్తారు, తనతోపాటు ఎంతమందిని తీసుకెళ్తారు, ఇప్పటికిప్పుడు ఆయన వెంట వెళ్లకపోయినా, ఎన్నికల సమయానికి బాలినేనితో వెళ్లేవారెవరు..? ఇలాంటి విషయాలపై అధిష్టానం నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఐ ప్యాక్ టీమ్ కూడా బాలినేని వ్యవహారంపై పూర్తి సమాచారాన్ని పార్టీ పెద్దలకు చేరవేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతానికి ఒంగోలులో బాలినేనిపై సింపతీ ఉంది. నిన్నటి కంటతడి ఎపిసోడ్ తో ఆ సింపతీ పెరిగింది. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పనిచేస్తున్నారని తేలిపోయింది. వారి పేర్లు చెప్పకుండా బాలినేని ట్విస్ట్ ఇచ్చారు కానీ ఎన్నిరోజులు ఆ పేర్లు దాగవు. కచ్చితంగా పేర్లు బయటకొస్తాయి, అప్పుడు అధిష్టానం వారివైపు ఉంటుందా, బాలినేని వైపు నిలబడుతుందా అనేది తేల్చుకోవాలి. ఇంత గొడవ జరిగింది కాబట్టి, ఇక బాలినేని వైసీపీలో ఇమడలేకపోవచ్చని అంటున్నారు. అదే జరిగితే ఆయనకు ఆల్రడి ఓ అస్త్రం చేతిలో రెడీగా ఉంది. తనను పార్టీలో ఇబ్బంది పెట్టారు అందుకే బయటకొచ్చానంటూ చెప్పుకోవచ్చు. మరి అధిష్టానానికి ఎదురుదాడి చేసేందుకు ఉన్న అవకాశమేంటి..?
బాలినేని గతంలోనే పక్క పార్టీలవారితో కలసిపోయారు, సొంత పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తున్నారు. అందుకే ఆయన్ను తప్పించామని చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు ఆ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు నేతలు. బాలినేనిపై వేటు పడితే సరైన రీజన్ చెప్పి మిగతా నాయకుల్ని పార్టీలోనే నిలుపుకోవాల్సిన అవసరం అధిష్టానంపై ఉంది. అందుకే పార్టీ పెద్దలు వేచి చూస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు.