Siddipeta News: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ప్రధాని మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, మాజీ హౌజ్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాము కూడా మంత్రి కేటీఆర్ ను పిచ్చోడు మాట్లాడినట్లు మాట్లాడాడని, ఆయన తండ్రి కేసీఆర్ లాగా తాగొచ్చి మాట్లాడుతున్నాడని, డ్రగ్స్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడని అనవచ్చని... కానీ అది తమ సంస్కారం కాదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తన సోదరి కవిత వ్యవహారంపై మాట్లాడకుండా, అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడకుండా ఏదో నోటికి వచ్చినట్లు కేటీఆర్ మాట్లాడాడన్నారు. ప్రధాని మోడీ, బండి సంజయ్ లను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని, వారు కూడా కేటీఆర్ లాగే ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తులని గుర్తు చేశారు. 


నిన్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని తమ బీజేపీ కార్యకర్తలు అడ్డు కోవడానికి కారణమేంటో మంత్రి కేటీఆర్ అడిగితే స్థానిక ఎమ్మెల్యే తెలియదని చెప్పడం, ఆయన సోయిలేని తనానికి నిదర్శనమని అన్నారు. అలాగే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మంత్రి కేటీఆర్ ధోరణిని వ్యతిరేకిస్తూ.. ఈ ప్రాంతం పట్ల వారికి ఉన్న చిన్న చూపును ఎత్తి చూపడానికే బస్సు ముందుకు వెళ్లారన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ బండి సంజయ్ వందల కోట్ల నిధులు తీసుకువచ్చారని, అసలు రాష్ట్రంలోనీ ప్రతి గ్రామంలో జరుగుతున్న పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి హుస్నాబాద్ ప్రాంతంలో జరగలేదని, కావాలంటే అక్కడికి వెళ్లి చూసి రావడానికి తాము సిద్ధమని సవాల్ విసిరారు. అలాగే స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మూడు బస్సులు పెట్టి ప్రతిపక్ష నాయకులను, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, పాత్రికేయలను తీసుకెళ్లడానికి తాము సిద్ధమని ప్రకటించారు. ఏం చేశారని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. 


డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో కానీ, దళిత బంధు విషయంలో కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కానీ బీఆర్ఎస్ నాయకులు కమిషన్లు తీసుకుంటున్నారని.. ఆ లిస్టు తన దగ్గర ఉందని పేర్కొన్నారు. చివరకు నిన్నటి బహిరంగ సభకు కూడా ఉపాధి హామీ కూలీలను, మహిళలను బెదిరించి తీసుకువచ్చారని ఆరోపించారు. గౌరవెల్లి ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడానికి నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ఇంకా పూర్తికాలేని ప్రాజెక్టును పూర్తయిందని ఎలా చెప్తున్నారనీ, పూర్తి అయితే తాము సంతోషిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కుయుక్తులు మాట్లాడిన రాబోయే కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని జోస్యం చెప్పారు.