Andhra Pradesh Elections : శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో దిగ్గజం దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు. స్వాతంత్య్రం అనంతరం జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి పార్లమెంట్‌కు విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఆనాడే జాతీయ స్థాయి నేతలను ఆకర్షించిన యువ కిశోరం. కాంగ్రెస్‌ను ఢీకొని ఇండిపెండెంట్‌గా నిలిచి పార్లమెంట్‌లో అడుగు పెట్టి నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టి ఆకర్షించగలిగారు. ప్రధాని కోరిక మేరకు కాంగ్రెస్‌లో చేరారు. 


నాటి నుంచి నేటి వరకు ఆ కుటుంబానికి ఎప్పుడూ టిక్కెట్‌కు కొదవలేదు. అసెంబ్లీ టిక్కెట్ కావాలన్నా, పార్లమెంట్ టిక్కెట్ కావాలన్నా హైకమాండ్ ఇస్తూ వస్తుంది. నెహ్రూ నుంచి రాహుల్‌ వరకు నాలుగు తరాల నాయకత్వంలో ప్రతి ఎన్నికల్లో టిక్కెట్ తెచ్చుకోగలిగారు. ఈసారి మాత్రం టికెట్‌ రాలేదు. అధిష్ఠానమే మొండి చేయి చూపిందో, అగ్రనాయకులు ఎవరైనా మెలికపెట్టారో తెలియదు గాని 2024 ఎన్నికల బరిలో బొడ్డేపల్లి కుటుంబం పోటీకి దూరంగా ఉంది.


స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మొన్నటి వరకు రాజగోపాలరావు పార్లమెంట్‌కు పోటీ చేసినంతకాలం ఆమదాలవలస సీటును తమ కుటుంబానికో సన్నిహితులకు ఇప్పించేవారు. గెలిపించుకొనేవారు. పార్లమెంట్ బరి నుంచి తప్పుకున్న తర్వాత రెండుసార్లు ఎంపీ సీటు కూడా విధేయుడైన డాక్టర్ కణితి విశ్వనాథ్‌కు ఇప్పించారు. రాజగోపాలరావు మరణాంతరం ఆయన కుమారుడు బొడ్డేపల్లి చిట్టిబాబు ఒకసారి పోటీ చేశారు. తర్వాత ఎన్నికల్లో రాజగోపాలరావు కోడలు బొడ్డేపల్లి సత్యవతి నిలబడతూ వచ్చారు. 


ఇప్పటివరకు బొడ్డేపల్లి కుటుంబం పార్లమెంట్‌కు ఆరుసార్లు, అసెంబ్లీకి రెండుసార్లు ఎన్నికైంది. రాజగోపాలరావు ఎంపిగా 32 ఏళ్లు ప్రాతినిధ్యం వహించగా, బొడ్డేపల్లి సత్యవతి పదేళ్లు శాసనసభ్యురాలిగా సేవలు అందించారు. రాజగోపాలరావు సోదరుడు బొడ్డేపల్లి వెంకటనరసింగరావు సమితి అధ్యక్షుడిగా, ఆమదాలవలస తొలి మున్సిపల్ చైర్మన్‌గా వ్యవహరించగా మరో సోదరుడు నారాయణమూర్తి శాసనమండలి సభ్యునిగా పని చేశారు. బొడ్డేపల్లి సత్యవతి కూడా గతంలో రెండుసార్లు మున్సిపల్ చైర్పర్సన్‌గా, బొడ్డేపల్లి మాధురి జెడ్పిటిసిగా, గోవింద గోపాల్ ఎంపిపిగా, దివంగత మురళీధర్ ఎంపిపిగా సేవలందిస్తూ వచ్చారు. డీసీసీ అధ్యక్షురాలిగా బొడ్డేపల్లి సత్యవతి ఒకసారి బాధ్యతలు నిర్వహించారు. ఇలా కాంగ్రెస్ పార్టీతో ఈ కుటుంబానికి ఎనలేని అనుబంధం ఉంది. ఇలాంటి కుటుంబం పోటీ చేసే అవకాశం లేకపోయింది.  


దాదాపు 16సార్లు ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన కుటుంబాన్ని ఎన్నికలకు దూరం చేయడం చర్చకు దారితీస్తోంది. గతంలో జగన్ నుంచి పిలుపువచ్చినా కాంగ్రెస్‌తో ఉంటామని చెప్పేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ టిక్కెట్ ఆమెకు రాకపోయేసరికి సొంత పార్టీకార్యకర్తలతో పాటు సొంత సామాజికవర్గం, పార్టీ నేతలు, ప్రజల్లో కూడా తీవ్రంగా చర్చ జరుగుతుంది.