YSRCP Leader Avanthi Srinivas Resigned: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖలో కీలక నేతగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధికారికంగా ఇవాళ ప్రకటించారు. వైసీపీ ఒడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2024లో భీమిలి నుంచి గంటా శ్రీనివాస రావుపై పోటీ చేసి ఓడిపోయారు. ఒకప్పుడు వీళ్లిద్దరూ మిత్రులుగా ఉండే వాళ్లు. తొలిసారి ఇద్దరూ పరస్పరం పోటీ పడ్డారు. 


పార్టీకి రాం రాం


వైసీపీ అధిష్ఠానానికి తన రాజీనామా లేఖను పంపించిన అవంతి శ్రీనివాస్‌ రాజకీయాలకు  దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని లేఖలో తెలిపారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలకి కూడా రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. తన రాజీనామాను ఆమోదించాలని అధిష్ఠానానికి సూచించారు. 


ప్రజలు ఎందుకు తిరస్కరించారో?


రాజీనామా తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ, జగన్‌పై విమర్శలు చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపించారు. కార్యకర్తలకు, నాయకులకు వైసీపీలో గౌరవం లేదని బాంబు పేల్చారు. కొత్త ప్రభుత్వానికి ఆరునెలల సమయం ఇవ్వాల్సింది పోయి అప్పుడే దాడి చేయడం సరికాదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానంటు చెప్పుకొచ్చిన అవంతి... ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అభిప్రాయపడ్డారు. ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నించినా ఎందుకు తమను తిరస్కరించారో అర్థం కావడం లేదని అన్నారు.  


పీఆర్‌పీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, ఇప్పుడు మళ్లీ ఏ పార్టీ?


అవంతి శ్రీనివాస్‌గా బాగా పరిచయమైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు విద్యావేత్తగా ఉంటూ రాజకీయ రంగప్రవేశం చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనపై ఉన్న అభిమానంతో అవంతి శ్రీనివాస్‌ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీ తరఫున 2009లో భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అవ్వడంతో పరిస్థితి మారిపోయింది. ఆయన కాంగ్రెస్‌లో ఉండలేక టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అప్పుడు లోక్ సభలో రూల్స్ కమిటీ సభ్యుడిగా, పరిశ్రమపై స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా చేశారు. 


Also Read: ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన 2024 - కొత్త స్టార్‌ పవన్ కల్యాణ్ - జగన్ బిగ్గెస్ట్ లూజర్ !


జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అవంతి శ్రీనివాస్


2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని ముందే గ్రహించిన అవంతి శ్రీనివాస్‌ వైసీపీలో చేరిపోయారు. అక్కడ భీమిలి నుంచి అసెంబ్లీ టికెట్‌ సంపాదించి విజయం సాధించారు. అంతేకాకుండా మంత్రిగా కూడా పని చేశారు. ఏపీ పర్యాటక, సంస్కృతి, యువజనాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలు అందించారు. 



టీడీపీలోకి వెళ్తారని టాక్ నడుస్తోంది


2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత అవంతి శ్రీనివాస్‌ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.  ఇప్పుడు ఆయనపార్టీకి రాజీనామా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలతో మాట్లాడారాని ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని టాక్ నడుస్తోంది. మరి ఆయన ఏం చెప్పబోతున్నారు... అనేది సస్పెన్స్‌గా మారింది. 


Also Read: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?