Asani Cyclone Latest News: దక్షిణ అండమాన్, బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో ఇప్పటికే పలు విమాన సర్వీసులు సోమవారం రద్దయ్యాయి. కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానాలు వెనక్కి వెళ్లిపోయాయి. విశాఖ నుంచి అన్ని ఇండిగో విమానాలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రద్దు చేశారు. ప్రతికూల వాతావరణంతో విశాఖకు వచ్చే విమానాల సర్వీసులు రద్దు అయ్యాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, హైదరాబాద్, ముంబయి, చెన్నై నుంచి వచ్చే ఇండిగో విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు విశాఖ ఎయిర్ పోర్టు అధికారులు తెలియజేశారు. ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా విమానాలు సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. వచ్చే 24 గంటల్లో అసని తుపాను బలహీనపడే సూచనలున్నాయని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలకు ఉరుములతో కూడిన జల్లులు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నట్టు తెలిపింది.
అసని తుపాను ప్రభావంతో ప్రతికూల వాతావరణం ఉన్నందున బుధవారం నాడు మొత్తం 46 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో 23 విశాఖకు వచ్చే సర్వీసులు, కాగా మిగతావి విశాఖ నుంచి ఇతర నగరాలకు వెళ్లే ఇండిగో విమాన సర్వీసులు.
ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు I5 711/712 ఢిల్లీ - విశాఖ, విశాఖ - ఢిల్లీ (DEL-VTZ-DEL) సర్వీసులు, బెంగళూరు - విశాఖ, విశాఖ - బెంగళూరు సర్వీసులు I5 1452/1453 BLR-VTZ-BLR రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది.
ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు సైతం రద్దయ్యాయి. 2 విశాఖకు వచ్చేవి ,2 సర్వీసులు విశాఖ నుంచి వెళ్లేవి రద్దు చేశారు.
తమ సర్వీసులను రద్దు చేసినట్లు స్పైస్ జెట్ ప్రకటన చేయలేదని విశాఖ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఆలస్యమైనా తమ సర్వీసులు నడపాలని సంస్థ భావిస్తోంది.
6E ఫ్లైట్స్ నేటితో పాటు విశాఖ నుంచి వెళ్లే రేపటి సర్వీసులు రద్దయ్యాయి.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వాతావరణ శాఖ జారీ చేసిన తుపాను హెచ్చరిక నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో విపత్తు అప్రమత్తత, నియంత్రణ చర్యలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ నెంబర్ 08856 293104, ఇది 24 గంటలు, తుపాను ముప్పు ముగిసే వరకూ పని చేస్తుందని కలెక్టర్ తెలియజేశారు. క్షేత్ర స్థాయిలో తుపాను సహాయ, రక్షణకు సంబంధించి వచ్చే కాల్స్ పై కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీములు వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపడతామన్నారు. తుపాను పరిస్థితులను నిరంతరాయంగా గమనిస్తూ, అవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు సముద్ర తీర మండలాల ప్రధాన కేంద్రాల్లో కూడా కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు.