Cyclone Asani Chariot at Sunnapalli: అసని తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్లు, సంబంధిత జిల్లాల మంత్రులు తుపాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కలగకూడదని, తీరం దాటిన తరువాత బాధితులకు సరైన ఆహారం, నీళ్లు అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో వింత చోటుచేసుకుంది. అసని తుపాను ప్రభావంతో ఇతర దేశానికి చెందిన ఓ మందిరం సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చింది.
తీరానికి తరలివస్తున్న స్థానికులు
తీరం వైపునకు మందిరం (రథం) కొట్టుకురావడంతో ఇది గమనించిన స్థానికులు మొదట్లో ఆందోళనకు గురయ్యారు. సంతబొమ్మాలి మండలం ఎం సున్నాపల్లి తీరానికి దాదాపు చేరుకున్న తరువాత మందిరం లాంటి రథాన్ని స్థానికులు తాళ్లతో లాగుతూ ఒడ్డుకు తీసుకొచ్చారు. వింత రథం విషయం తెలియగానే స్థానికులు వీక్షించేందుకు భారీ సంఖ్యలో సున్నాపల్లి రేవుకు చేరుకున్నారు. తీవ్రరూపం దాల్చిన తుపాను (Cyclone Asani Effect) ప్రభావంతో బంగారం రంగులో ఉన్న రథం తమ తీరానికి కొట్టుకురావడంతో స్థానికులకు వింత అనుభూతి కలిగింది.
ఎక్కడి నుంచి కొట్టుకువచ్చిందో ?
ఆ రథం మలేషియా, థాయిలాండ్ లేక జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని కొంతమంది సీమెన్ లు భావిస్తున్నారు. గతంలో తిత్లీ లాంటి పెద్ద తుపానులు సంభవించినప్పుడు సైతం ఇలాంటివిచిత్రమైన వస్తువులు, రథాలు తాము చూడలేదని స్థానికులు చెబుతున్నారు. తమ తీరానికి స్వర్ణ మందిరం కొట్టుకు వచ్చిందంటూ కొందరు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు అక్కడికి చేరుకుని రథాన్ని పరిశీలించారు. అది ఎక్కడినుంచి కొట్టుకువచ్చింది అనే విషయం తెలియాల్సి ఉంది.
కాకినాడ, విశాఖపట్నం తీరానికి అసని తుపాను..
అసని తుపాను వాయువ్య దిశగా కదులుతూ మే 11 ఉదయానికి కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా రానుందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రంలో అలజడి అధికం కావడంతో మే 12వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చిరించింది. అనంతరం బలహీనపడి దిశ మార్చుకుని ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర మరియు ఒడిశా తీరాలకు దూరంగా వాయువ్య బంగాళాఖాతంలోకి వెళ్లే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో తుపాను బలహీనపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.