Cyclone Asani Live Updates: దక్షిణ అండమాన్ సముంద్ర, బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను మరికొన్ని గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చనుంది. అసనీ తుపాను కాకినాడకు 210 కి.మీ, విశాఖపట్నానికి 310 కి.మీ, గోపాలపూర్‌కు 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. అసని తుపాను వాయువ్య దిశగా కదులుతూ మే 11 ఉదయానికి కాకినాడ -విశాఖపట్నం తీరాలకు దగ్గరగా రానుందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రంలో అలజడి అధికం కావడంతో మే 12వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చిరించింది.


అనంతరం బలహీనపడి దిశ మార్చుకుని ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర మరియు ఒడిశా తీరాలకు దూరంగా వాయువ్య బంగాళాఖాతంలోకి వెళ్లే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో తుపాను బలహీనపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్ర డైరెక్టర్ స్టెల్లా. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సైతం రేపటి వరకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు అసనీ తుపాను (Cyclone Asani) ప్రభావం నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.






విశాఖలో నేవీ రెడీ..
అసని తుపాను బుధవారం ఉదయం కాకినాడ, విశాఖపట్నం తీరాలకు అతి సమీపానికి రానుంది. ఈ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విశాఖలో భారత నేవీకి చెందిన ఈస్ట్రన్ కమాండ్ తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రజలను అలర్ట్ చేసి, తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. తుపాను తీరాన్ని దాటనున్నందున బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న విశాఖపట్నంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. 


అసని తుపాను కాకినాడ, విశాఖపట్నం తీరం నుంచి ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని చెబుతున్నా, ఏ ప్రాంతంలో తీరాన్ని దాటుతుందో ఇప్పటివరకూ వాతావరణ శాఖ ప్రకటించలేదు. 5 నేవీ ఓడలలో వరద బాధితులకు సహాయం కోసం అవసరమైన వాటిని సిద్ధం చేశారు. 19 వరద బాధితుల సహాయ టీమ్స్, 6 డైవింగ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. విశాఖలో ఐఎన్ఎస్ డేగా, చెన్నైలో ఐఎన్ఎస్ రజలీని భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొనే ప్రాంతంలో బాధితులకు సహాయం కోసం సిద్ధంగా ఉంచినట్లు నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. 






అప్ర‌మత్తంగా ఉండండి
అసని తుపాను విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఇన్‌చార్జి మంత్రి విడ‌ద‌ల ర‌జిని క‌లెక్ట‌ర్ ఎ.మ‌ల్లికార్జున‌రావుకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖపట్నంపై అసని తుపాను ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టం, ఈదురు గాలుల వర్షాల నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ తో మంత్రి మాట్లాడారు. అసని తుపాను బాధితులుగా జిల్లాలో ఒక్క‌రు కూడా ఉండ‌టానికి వీల్లేద‌ని, తుపాను ప్ర‌భావిత ప్రాంతాల వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సూచించారు. పున‌రావాస కేంద్రాల వ‌ద్ద వైద్య శిబిరాలు చేప‌ట్టాల‌న్నారు. జ‌న‌జీవ‌నానికి విఘాతం క‌ల‌గ‌కుండా చూడాల‌న్నారు. రెస్య్కూ టీంల ను సిద్ధం చేసుకుని ఉంచుకోవాల‌న్నారు. తీర ప్రాంత వాసుల‌ను అప్ర‌త‌మ‌త్తం చేయాల‌న్నారు. పున‌రావాస కేంద్రాల వ‌ద్ద వ‌స‌తి, భోజ‌న స‌మ‌స్య‌లు రాకుండా చూడాల‌ని చెప్పారు.


Also Read: Cyclone Asani Effect: అసనీ తుపానుతో ఏపీలో భారీ వర్షాలు - ఆ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ


Also Read: Asani Cyclone Effect: అసని ధాటికి వణికిపోతున్న ఆంధ్రా తీరం- శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గాలి వాన