అసని తుపాను ప్రభావం మొదలైంది. తుపాను కేంద్రం ఉత్తరాంధ్ర, ఒడిశాకు మధ్యలో ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి  తిరుపతి వరకు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో ఈదురు గాలులు వణికిస్తున్నాయి. భారీ గాలులతో చెట్లన్నీ ఊగిపోతున్నాయి. 


దక్షిణ కోస్తా జిల్లాలకు అసని తుపానుతో పెద్దగా ముప్పు లేదని అధికారులు అంచనా వేసినా ఇప్పుడు వర్షాలు మాత్రం దంచికొడుతున్నాయి. వర్షాల కారణంగా జిల్లాలో రైతులు వణికిపోతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోసారి ఇప్పుడు వర్షాలు మొదలవడంతో రైతుల్లో భయం పెరిగింది. 


తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా పరిధిలోని ఉప్పాడ సముద్రం అసని తుఫాను కారణంగా ముందుకు దూసుకొస్తోంది. దీంతో తీరం కోతకు గురవుతోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న అధికారులు కాకినాడ- ఉప్పాడ బీచ్ రోడ్డు తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పాడ తీరంలో అలల ధాటికి రోడ్డు మరింత కోతకు గురైంది. అసని తుఫాను కారణంగా కాకినాడ సముద్రతీరంలో సందర్శకులను నిలిపివేశారు.. 


కోనసీమ జిల్లా ఓడలరేవు సముద్రతీరం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. సముద్రపు కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ ఓఎన్జీసీ టెర్మినల్ వరకు ఎగిసిపడుతున్నాయి. అంతర్వేది తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో సముద్ర తీరం కోతకు గురవుతుంది. అసని తుపాను ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు కల్లాల్లోలోనే ఉండిపోయిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.


బంగాళాఖాతంలోని తీవ్ర తుపాను ఆసని తెల్లవారు జాముకి కాకినాడకు ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరాన, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 350 కిలో మీటర్ల దూరాన కేంద్రీకృతమైంది. ఈ అర్థరాత్రి వరకూ ఇది వాయవ్యంగా పయనించి ఉత్తరాంధ్రకు చేరువగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 


ఆసని తీరం దాటకుండా మలుపు తీసుకుని ఉత్తర ఈశాన్యంగా పయనించి వాయవ్య బంగాళాఖాతంలోకి వెళ్లి క్రమంగా బలహీన పడుతుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో ఉరుములు, గాలి తీవ్రతతో కూడిన వర్షాలు పడున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదవుతున్నాయి. తెలంగాణలో ఉరుములతో వర్షాలు‌పడే అవకాశం ఉంది. 


ఆసని కారణంగా విశాఖ విమానాశ్రయంలో రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విశాఖకు రావాల్సిన, విశాఖ నుంచి వెళ్లాల్సిన అన్ని విమానాలు రద్దు చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాదహెచ్చరికలు జారీ చేశారు. రాబోయే ఐదు రోజులు సముద్రంలో చేపల వేటపై నిషేధాజ్ఞలు విధించారు.