నెల్లూరుకి చెందిన ప్రముఖ చిత్రకారుడు అమీర్ జాన్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ఉపరాష్ట్రపతి నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆయనకు నెమలి పింఛంపై వేసిన బొమ్మను బహుమతిగా అందించారు అమీర్ జాన్. నెమలి పింఛం మధ్యలో ఉన్న భాగంగా.. ఉపరాష్ట్రపతి బొమ్మను అద్భుతంగా చిత్రీకరించారు. ఆ తర్వాత దాన్ని ఒక ఫ్రేమ్ లో ఉంచి ఉపరాష్ట్రపతికి నేరుగా అందించారు. ఆ ఫొటోని స్వీకరించిన ఉపరాష్ట్రపతి అమీర్ జాన్ ని అభినందించారు.  


అక్కడితో అయిపోతే అందులో విశేషం ఏముంది. ఉప రాష్ట్రపతి తన పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన నుంచి అమీర్ జాన్ కి ఓ లెటర్ వచ్చింది. ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి స్పీడ్ పోస్ట్ లో ఓ కవర్ అందింది. అది చూసి సంబరపడిపోతున్నారు అమీర్ జాన్. తన పెయింటింగ్ ని మెచ్చుకుంటూ ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రత్యుత్తరం వచ్చిందని, తనని అభినందిస్తూ ప్రశంసాపత్రం అందించారని గర్వంగా చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ధన్యవాదాలు చెబుతున్నారు అమీర్ జాన్. 




నెల్లూరుకి చెందిన అమీర్ జాన్ ఇప్పటికే చిత్రకళలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. సూక్ష్మ చిత్రాలను రూపొందించడంలోనూ ఆయన సిద్ధహస్తుడు. చిన్న చిన్న ఆకులు, కొబ్బరి చిప్పలు, చింత పిక్కలపై కూడా ఆయన అధ్బుమైన చిత్రాలు గీయగలడు. భారీ కాన్వాసా పై చిత్రాలు వేస్తారు. ఈ క్రమంలో ఆయన లిమ్కా బుక్ ఆప్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆప్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించారు. చిత్రకళలో నెల్లూరుకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. 


అమీర్ ఆర్ట్స్ అకాడమీ పేరుతో అమీర్ జాన్ చిన్నారులకు శిక్షణ కూడా ఇస్తుంటారు. ప్రతి వేసవిలో ఆయన సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తుంటారు. నెల్లూరు నగరంలో విద్యార్థులకు ప్రత్యేకంగా ఆయన శిక్షణ ఇస్తుంటారు. అమీర్ జాన్ శిక్షణలో రాటుదేలిన ఎంతోమది విద్యార్థులు ఆ తర్వాత చిత్రకళను హాబీగా మార్చుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పురస్కారాలు అందుకున్నారు. 


గిన్నిస్ బుక్ ఎక్కడమే లక్ష్యం.. 
చిత్రకళలో తాను గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు సంపాదిస్తానని నమ్మకంగా చెబుతుంటారు అమీర్ జాన్. ఈ క్రమంలో ఆయన పలు రకాల ప్రయత్నాలు చేశారు. ఇటీవలే స్పైసీ పెయింటింగ్ పేరుతో భారీ కాన్వాస్ పై ఆయన పసుపు, కారం తో కలిపి పెయింటింగ్ వేశారు. ఇది గిన్నిస్ బుక్ వారి పరిశీలనలో ఉంది. అయితే ఎన్ని అవార్డులు వచ్చినా.. తాజాగా ఉపరాష్ట్రపతి నుంచి వచ్చిన ప్రశంస మాత్రం తనకి జీవితాంతం గుర్తుండిపోతుందని అంటున్నారు అమీర్ జాన్.