ANdhra Pradesh News: మిచౌంగ్ తుఫాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం బుధవారం (డిసెంబర్ 13) విపత్తుల సంస్థ కార్యాలయంలో విపత్తుల శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్, అగ్రికల్చరల్ కమిషనర్ సిహెచ్ హరికిరణ్, హార్టికల్చరల్ కమిషనర్ డా.శ్రీధర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. 


మిచౌంగ్ తుఫాను ఏపీ కోస్తా తీరానికి సమాంతరంగా పయనించడం వలన ఇంతకు ముందెన్నడూలేని విధంగా 19 జిల్లాల్లో ప్రభావం చూపిందని.. సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని విపత్తుల శాఖ స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్ కేంద్ర బృందాన్ని కోరారు.


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం బుధ, గురువారాల్లో  రెండు రోజులపాటు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుందని తెలిపారు. కేంద్ర బృందం టీమ్ లీడర్ రాజేంద్ర రత్నూ మాట్లాడుతూ.. తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన 4 జిల్లాల్లో  దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తామన్నారు. త్వరగా కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి వీలైనంత మేర ఆదుకోవడానకి తమవంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు.


రాష్ట్రంలో తుఫాను వల్ల కలిగిన నష్టాల్ని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.ఆర్ అంబేద్కర్,  కేంద్ర బృందానికి వివరించారు. క్షేత్రస్థాయిలో  జరిగిన నష్టానికి సంబంధించి మధ్యంతర నివేదిక అందించామని తెలిపారు. శాఖాపరంగా ఆర్ & బీలో రూ.2,641 కోట్లు, వ్యవసాయశాఖలో రూ.703 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో రూ.100 కోట్లు, హార్టికల్చర్ లో రూ. 86.97 కోట్లు ఎక్కువగా నష్టం వాటిల్లిందని చెప్పారు. మొత్తంగా మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వాటి పునరుద్ధరణకు రూ.3,711 కోట్లు సాయం అందించాలని మధ్యంతర నివేదికలో కోరినట్లు తెలిపారు.


విపత్తు సమయంలో ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ సేవలు బాధితులకు అండగా ఉందని వివరించారు. కలెక్టర్లకు వెంటనే నిధులని ఇచ్చామని దీనివలన  పునరుద్ధరణ పనులు వేగంగా జరిగినట్లు తెలిపారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడూ తుఫానుపై జిల్లా కలెక్టర్లకు సూచనలు ఇచ్చామని చెప్పారు.  ఈ సమావేశంలో విద్యుత్ శాఖ, ఇరిగేషన్, ఆర్&బి, ఆర్ డబ్ల్యూఎస్,  ఫిషరీస్, విపత్తుల సంస్థ ఈడీ సి.నాగారాజు, ఇతర శాఖల డిప్యూటీ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.