YS Sharmila : వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో మూడు వేల మందిని విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమవుతుందని అన్నారు ఏపీపిసిసి చీఫ్ YS షర్మిల. ఇప్పటికే అన్యాయంగా 2000 మందిని తొలగించారని వారి తరఫున తాను దీక్ష చేస్తుంటే దానిని అడ్డుకున్నారని ఆమె అన్నారు. కార్మికుల పక్షాన దీక్ష చేయడం  నేరమా అన్న షర్మిల షర్మిల అసలు స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుందో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలుసా అని ప్రశ్నించారు. గతంలో పెద్దపెద్ద మాటలు  చెప్పి ఎన్నో హామీలు ఇచ్చిన ఆ ఇద్దరూ ఇప్పుడు కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు. ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ కాంగ్రెస్ హయాంలో లాభాల్లో నడిచిందని.. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ప్రవేట్ పరం చేయడానికి దానిని నష్టాల్లోకి తెచ్చారని 2014 నుంచి స్టీల్ ప్లాంట్‌కు కష్టాలు మొదలయ్యాయని షర్మిల తెలిపారు. ప్లాంట్‌ను అమ్మేసే కుట్ర కేంద్రంలో బిజెపి చేస్తుందని ఇక్కడ కాంట్రాక్టు కార్మికుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆమె అన్నారు.


స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడానికి ఇచ్చిన 11 వేల కోట్లు ఒక అబద్ధం 


ఆ మధ్య స్టీల్ ప్లాంట్ కష్టాలను ఆదుకోవడానికి  కేంద్రం ప్రకటించిన 11 వేల కోట్ల సాయం ఒక అబద్ధం అన్నారు షర్మిల. బ్యాంకు ఖాతాలో కేవలం అరగంట మాత్రమే ఆ డబ్బు ఉందని,రుణాల కింద ఆ డబ్బును వెనక్కి తీసేసుకున్నారని కార్మికుల కోసం దానిని ఏమాత్రం వాడలేదని షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో 34,000 మంది  కార్మికులు స్టీల్ ప్లాంట్‌లో ఉంటే వారిని ఇప్పుడు 16 వేలకు కుదిస్తున్నారని ఇలా కార్మికుల పొట్ట కొట్టడం అన్యాయమని షర్మిల అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి సొంత మైన్ ఇవ్వడం ఒక్కటే దానిని కాపాడే మార్గమని తెలిపిన షర్మిల తొలగించిన 2000 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని  లేకుంటే వాళ్లకి పరిహారం తో కలిపి ఫుల్ సెటిల్మెంట్ చేయాలని   డిమాండ్ చేశారు.