ఉత్తరాంధ్ర జిల్లాలకు తలమానికంగా నిలవనున్న వివిధ ప్రాజెక్టులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మే 3న శంకుస్థాపన చేయనున్నారని వైయస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చెప్పారు. సుమారు 3,500 కోట్ల రూపాయలతో విశాఖ ఐటీ సెజ్ లోని హిల్ నెంబర్ 4 మీద నిర్మించనున్న వైజాగ్ టెక్ పార్క్ ( అదానీ డేటా సెంటర్) కు సీఎం జగన్ వచ్చే నెల మూడో తేదీన శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి హిల్ నెంబర్ 3 మీద నిర్మిస్తున్న హెలిప్యాడ్ ను, హిల్ నెంబర్ 4 మీద నిర్మించనున్న డేటా సెంటర్ కు సంబంధించిన ఏర్పాట్లను వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశీల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కలెక్టర్ మల్లికార్జున, నగర్ పోలీస్ కమిషనర్ తదితరులు శనివారం ఉదయం పరిశీలించారు. 


అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని చెప్పిందని, అన్నమాట ప్రకారమే వచ్చే నెల మూడో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాకుండా, వెంటనే పనులు మొదలుపెట్టనున్నారని చెప్పారు. అలాగే విశాఖ నగరానికి పేరు తెచ్చే విధంగా వైజాగ్ టెక్ పార్క్( అదానీ డేటా సెంటర్) నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని ఆయన చెప్పారు. 134 ఎకరాలలో నిర్మిస్తున్న ఈ టెక్ పార్కు మూడు దశలలో ఏడేళ్లలో పూర్తి చేస్తామని సుబ్బారెడ్డి వివరించారు. ఈ టిక్ పార్క్ ద్వారా సుమారు 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించునున్నాయని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారని సుబ్బారెడ్డి అన్నారు.


టిడిపివి రాజకీయ ఫలకాలు : మంత్రి అమర్నాథ్
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసిన శిలాఫలకాలు కేవలం రాజకీయం కోసమే అని అన్నారు. ఆ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క భారీ ప్రాజెక్టునైనా ప్రారంభించి పూర్తి చేసిందా? అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని నమ్మలేదని, వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపికి, చంద్రబాబు నాయుడుకి పలకలే మిగులుతాయని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు రెండోసారి శంకుస్థాపన చేస్తున్నామని జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ 2019 మార్చి 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఫిబ్రవరి 15వ తేదీన శంకుస్థాపన చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. తమది నిబద్ధతతో కూడిన ప్రభుత్వం కాబట్టే ఎన్నికలకు సంవత్సరానికి ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయడంతో పాటు, వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. 
2,200 ఎకరాలలో 35 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎయిర్ పోర్టుకు అన్ని రకాల అనుమతులు లభించాయని,  నిర్మాణ సంస్థకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుందని అమర్నాథ్ వివరించారు. అలాగే వైజాగ్ టెక్ పార్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 40,000 మందికి ప్రత్యక్షంగా 50 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి అని చెప్పారు. టెక్ పార్కు అందుబాటులోకి వస్తే విశాఖ ఆర్థికంగా ఎంతో ఉన్నతిని సాధిస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూలై నుంచి విశాఖలోనే ఉంటారని మంత్రి అమర్నాథ్ పునరుద్ఘాటించారు.


మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకులకు సెల్ఫీలు పిచ్చి పట్టుకుందని, దమ్ముంటే ఆ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూడాలని సవాలు విసిరారు. అభివృద్ధి ఏమాత్రం పట్టని ఆ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని, వీలైతే రాష్ట్ర అభివృద్ధికి సలహాలు ఇవ్వాలి.. లేకుంటే మాట్లాడకుండా ఉండడం మంచిదని అవంతి హితవు పలికారు.