Anganwadi workers stop Botsa Car: మెంటాడ: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. తమ డిమాండ్లను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ అంగన్వాడీలు మంత్రి బొత్స కాన్వాయ్ ను అడ్డుకున్నారు. దాదాపు అరగంటపాటు మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు అంగన్వాడీలు దారివ్వలేదు. కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసే ప్రయత్నం చేయగా, వీడియో తీయవద్దంటూ సీరియస్ అయ్యారు. పోలీసులు జోక్యం చేసుకుని అంగన్వాడీలకు సర్దిచెప్పడంతో మంత్రి బొత్స కారులో వెళ్లిపోయారు. సమ్మె (Anganwadi Strike) కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.


మూడు నెలల తరువాతే వేతనాల పెంపు
మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. మెంటాడ మండలం పర్యటన ముగించుకుని ఆయన విజయనగరం వెళుతున్నారు. ఈ క్రమంలో గజపతినగరంలో అంగన్వాడి వర్కర్స్ మంత్రి బొత్స సత్యనారాయణ వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ జీతాలు పెంచాలని కోరుతూ అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. తాను ఇంతకుముందే చెప్పినట్లు మూడు నెలల తరువాతే మీ వేతనాలు పెంచుతామని చెప్పారు. మొత్తం 11 డిమాండ్లు చేయగా ఇప్పటికే అంగన్వాడీల 10 డిమాండ్లు నెరవేర్చామన్నారు. ప్రస్తుతం జీతాల పెంపు గురించి అడగవద్దని, 3 నెలల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అప్పుడు మీ డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ వర్కర్స్ రేపటి (మంగళవారం) నుంచి విధులకు హాజరుకావాలని సూచించారు. కానీ అంగన్వాడీలు మాత్రం జీతాలు పెంచితే గానీ సమ్మె విరమించేది లేదన్నారు. చివరకు పోలీసులు, స్థానిక నేతలు జోక్యం చేసుకుని అంగన్వాడీలకు సర్దిచెప్పారు. అనంతరం మంత్రి బొత్స తన వాహనంలో విజయనగరం వెళ్లారు. 


వరుస సమ్మెలతో సర్కార్‌కు తప్పని తిప్పలు 
ఏపీలో ఓవైపు అంగన్వాడీలు, మరోవైపు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడం వల్లే తాము సమ్మెను ముందుకు తీసుకెళ్తున్నామని కార్మికులు, అంగన్వాడీలు చెబుతున్నారు. రెండు, మూడేళ్లకు ఒకసారి జీతాల పెంపు వీలు కాదంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే అంగన్వాడీలు సమ్మె విరమించపోవడంతో వారిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం తెలిసిందే. ఆ కారణంగా 6 నెలల వరకు వారు సమ్మె చేయడానికి అవకాశం ఉండదు. ఐదేళ్లకు ఒక్కసారే ఉద్యోగుల జీతాల పెంపు సాధ్యమని, ఇలా 2, 3 సంవత్సరాలకు వేతనాల పెంపు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.