Vizianagaram Train Accident : విజయనగరం వద్ద జరిగిన ప్రమాదానికి కారణాలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ప్రమాదానికి ప్రస్తుతం జరిగిన యాక్సిడెంట్‌కు దగ్గర పోలిక ఉందని మాత్రం నిపుణులు చెబుతున్నారు.
విశాఖ నుంచి బయల్దేరిన పలాస పాసింజర్ రైలు కంటకాపల్లి నుంచి బయల్దేరిన పావుగంటకే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన మార్గంలో మూడు లైన్లు ఉన్నాయి. అందులో మధ్యలైన్‌లో పలాస పాసింజర్ ట్రైన్‌ను నిలిపారు. అదే లైన్‌లో వచ్చిన రాయగడ పాసింజర్ పలాస వెళ్లే ట్రైన్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో పలాస పాసింజర్ బోగీలు ఎగిరిపడి పక్కనే ఉన్న గూడ్స్ ట్రైన్‌పై పడ్డాయి. గూడ్స్‌కు చెందిన మరికొన్ని బోగీలు కూడా ఎగిరి పడ్డాయి. మొత్తంగా ఏడు బోగీలు నుజ్జునుజ్జు అయిపోయాయి.
అయితే అధికారుల అనుమతితో మధ్య లైన్‌లోని పలాస పాసింజర్‌ను ఆపు చేశారు. మరి అదే మార్గంలో వేరే రైలుకు ఎలా అనుమతి ఇచ్చారనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. ఇది మానవ తప్పిదమా లేకుంటే సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ప్రమాదం జరిగిన టైంలో విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు. మరి ఆ సమాచారాన్ని కూడా వెనుక నుంచి వస్తున్న ట్రైన్‌కు ఇవ్వాలని అది కూడా ఇక్కడ జరగలేదు.
అసలు పలాస పాసింజర్ రైలును ఎందుకు మధ్య లైన్‌లో నిలిపారనే అనుమానం వస్తోంది. సాంకేతిక కారణాలతో నిలిపారా లేకుంటే ముందు స్టేషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
గత జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో కూడా ఇలాంటి అత్యంత విషాదకర ఘటన జరిగింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ప్రమాదం జరిగింది. స్టేషన్ వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్, ఎలక్ట్రిక్ లిఫ్టింగ్ బారియర్ లోపాలు కారణంగా ప్రమాదం జరిగింది. సాంకేతికతలో లోపాల కారణంగా రాంగ్ లైన్‌లో గ్రీన్ సిగ్నల్ పడిందని, ఫలితంగా ఆగి ఉన్న గూడ్స్ రైలు, మరో రైలు ఢీకొట్టింది.
బాలాసోర్‌లో సేమ్ టు సేమ్
బాలాసోర్‌లో సిగ్నలింగ్ లోపంలో కోల్‌కతా-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 293 మంది మరణించగా, సుమారు 1,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలభై ఒక్క మంది ప్రయాణికులను ఇంకా గుర్తించలేదు. గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒడిశా ప్రమాదం ఒకటి.
ఈ ప్రమాదంలో కుట్ర కోణం ఉందని అనుమానించిన కేంద్రం... సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. జులై ప్రారంభంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ప్రమాదానికి సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులు అరుణ్ కుమార్ మహంత, మహమ్మద్ అమీర్ ఖాన్, పప్పు కుమార్‌ను అరెస్టు చేసింది. హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, కుట్ర పూరిత హత్యా నేర అభియోగాలు వారిపై మోపారు. జూలై 15న రిమాండ్ కాలం ముగిసిన తర్వాత నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.