AP Minister Achchennaidu : మూడు, నాలుగు నెలలు ఛాలెంజ్ తీసుకొని ప్రతీ ధాన్యం గింజ రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు అచ్చెన్నాయుడు. ధాన్యం సేకరణ ఒక పద్ధతి, విధానంలో జరగాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు.
ఒడిశా నుంచి ఏపీలోకి ధాన్యం రాకుండా నివారించాలని అధికారులను అచ్చెన్న ఆదేశాలు ఇచ్చారు. గత ఐదేళ్లలో ధాన్యం సేకరణ సక్రమంగా జరుగలేదన్నారు. జిల్లాలో కొన్ని రైస్ మిల్లులను పక్కన పెట్టేవారని, అలాంటి వాటికి తావులేకుండా చూడాలని ఆదేశించారు. మూడు నాలుగు నెలలు ఛాలెంజ్‌గా తీసుకొని ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ప్రైవేటు ఆర్గనైజేషన్ కొనుగోలు చేస్తే గతంలో వారు ఎలా సేకరంచారో పరిశీలించాలన్నారు అచ్చెన్న. మార్కెటింగ్, పీఏసీఎస్‌ల, స్వయం సహాయక సంఘాలు ద్వారా సేకరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాలు ఎన్ని ఉండాలో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ అస్తవ్యస్తంగా ఉండకూడదన్నారు. ధాన్యం కొనుగోలుకు ఎలాంటి నియమ, నిబంధనలు ఉండవన్నారు. రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ విక్రయాలు చేసుకోవచ్చన్నారు.
గత ఐదేళ్లుగా ఏ రైస్ మిల్లు ఎన్ని ధాన్యాన్ని సేకరించిందో ఆ వివరాలను తెలిపాలన్నారు అచ్చెన్న. రైతు పండించిన ప్రతీ గింజ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. రీ సైక్లింగ్ చేయయాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలుకేంద్రాల వద్ద ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే దానిని సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
రైతులు తడి ధాన్యాన్ని తీసుకురాకూడదని, ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు అచ్చెన్న. గ్రేడ్-ఎ ప్రమోట్ చేయాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి ఈనెల 17 నాటికి బ్యాంకులన్ని గ్యారంటీలు సిద్ధం చేసుకోవాలన్నారు. గతంలోధాన్యం సేకరణ చేసి రైతులకు డబ్బు ఇవ్వని మిల్లులు ఉన్నాయా అని మంత్రి అడగ్గా అలాంటివేమీ లేవని అధికారులు చెప్పారు.
ధాన్యం సేకరణకు మార్కెటింగ్ శాఖ, పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్ సిబ్బంది చాలకపోతే సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు అచ్చెన్న. మిల్లర్లకు బకాయిలు ఉన్న వివరాలను మంత్రి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ను అడుగ్గా, బకాయిలు ఉన్నాయని వివరించారు. పెండింగులో ఉన్న వివరాలను అందజేయాలని ఆదేశించారు. నీరు అందక పంటలు పండని భూ వివరాలను మూడు రెవెన్యూడివిజన్ల నుంచి అందజేయాలని ఆర్డీఓలను ఆదేశించారు.
గత ఐదేళ్లలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.. ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు అచ్చెన్న. ఇప్పుడు మాత్రం కొత్త రాజకీయాలు మాట్లాడుతూ వస్తున్నారన్నారు. మా ప్రభుత్వంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలను తీసుకుంటున్నామన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిపై కేసులు పెట్టి జగన్ పైశాచిక ఆనందం పొందారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుస్తోందని కక్ష సాధింపు లేదన్నారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్నామన్నారు. భావ స్వేచ్ఛ అంటూ వ్యక్తి హననానికి పాల్పడుతున్న వ్యక్తులను వదిలేయాలా అని ప్రశ్నించారు. జన్మనిచ్చిన తల్లి, చెల్లిపై తప్పుడు పోస్టులు పెట్టిన జగన్ మనిషేనా?ఆడవారిని ఏడిపిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్