Anakapalle Tribal protest for Electricity:
- సాయంత్రం అయితే అంధకారమే
- విశాఖ ఏజెన్సీ లో గిరిజనుల దీన గాథ
- స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా చీకటి లోనే గిరిపుత్రులు
- అనకాపల్లి జిల్లా "నీలి బంద" పల్లె ను పట్టించుకునే నాథుడు ఎవరు??
- కరెంట్ లేక కాగడాలతో నిరసన
విశాఖ మన్యంలోని అనకాపల్లి జిల్లా " నీలి బంధ" గ్రామం లో గిరిజనులు తమకు కరెంటు లేదంటూ కాగడాలతో నిరసన చేపట్టారు. జిల్లా లోని రోలుగుంట మండలం ఆర్ల పంచాయితీ లోని కొండలలో ఈ "నీలిబంద" పల్లె ఉంది. ఇక్కడ తరతరాలుగా నివసిస్తున్న గిరిజనుల కుటుంబాలు 30కి పైగా ఉన్నాయి. వీరంతా కోందు తెగకు చెందిన వారు. దట్టమైన అడవి మధ్య లో నివసించే వారు పగటి పూట మాత్రమే బయటకు రాగలుగుతున్నారు. సాయంత్రం అయితే చాలు తమ ఇళ్ళ నుండి కాలు బయట పెట్టలేని పరిస్థితి. కారణం దశాబ్దాలు గడుస్తున్నా వారికి ఎటువంటి విద్యుత్ సౌకర్యం లేకపోవడమే. చుట్టూ వన్య ప్రాణులు సంచరిస్తూ ఉండడం తో చీకటి పడ్డాక కాలు బయటపెడితే ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో అన్న భయం లోనే వారు బతుకీడుస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఒకసారి మొఖం చూపే నేతలు గెలిచిన తర్వాత తమ వైపు కూడా చూడట్లేదనీ.. తమ గ్రామానికి కరెంట్ సౌకర్యం కలిగిస్తామని ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని వారు తీవ్ర నిరసనలు తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా గిరిజనులు కాగడాల తోనే తమ వ్యధను తెలియజేశారు. రాత్రి పూట కనీసం కాలకృత్యాల కోసం కూడా ఇంటినుండి బయటకు రాలేని దారుణ పరిస్థితుల్లో తాము జీవనం సాగిస్తున్నామని ఆదీవాసీలు (Manyam Tribals) అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ గ్రామానికి కరెంట్ సౌకర్యం ఏర్పాటు చెయ్యాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు.
కరెంట్ మాత్రమే కాదు.. తాగు నీటి సమస్యా అధికమే
వీరికి కరెంట్ లేకపోవడమే. కాదు కనీసం త్రాగునీటి వసతీ ఈ ఆదివాసీ బిడ్డలకు లేదు. కిలోమీటర్ మేర అడవిలో నడిస్తేనే గానీ వీరికి మంచి నీరు దొరకదు. ఏదైనా హాస్పిటల్ కు వెళ్లాలంటే ఇప్పటికీ డోలీ మోత తప్ప మరో ఆప్షన్ లేని సమస్య వీరిది. దశాబ్దాలు గడుస్తున్నా తమకు సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదని వాపోతున్నారు గిరిజనులు.
గ్లోబల్ సమిట్ లు ( Vizag Global Summit ) కాదు ఆది వాసీల గోడు వినండి : ప్రజాసంఘాలు
లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్న ప్రభుత్వం అంటూ ప్రకటనలు చేసే ముందు విశాఖ కు కూత వేటు దూరంలో ఉన్న గిరిపుత్రుల వ్యధ ను కూడా కాస్త మానవత్వం తో ఆలకించండి అంటున్నాయి ప్రజాసంఘాలు. జిల్లా కలక్టర్ ఈ విషయం లో ప్రత్యేక చర్యలు తీసుకొని కనీసం సోలార్ ద్వారా అన్నా నీలిబంద గ్రామానికి కరెంట్ సౌకర్యం కలిగించాలని అనకాపల్లి జిల్లాకు చెందిన సీపీయం నాయకులు గోవిందరావు , చిరంజీవి లాంటి వారు డిమాండ్ చేస్తున్నారు .