ఏపీలో సీఎం జగన్ పాలనతో అవినీతి, కుంభకోణాలు తప్ప ఇంకేం లేవని.. ప్రధాని మోదీ ఇస్తున్న ఉచిత బియ్యంపైన సైతం జగన్ ఫొటో వేసుకుంటున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. విశాఖలోని రైల్వే గ్రౌండ్ లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి వచ్చి పలు విషయాలు ప్రస్తావించారు. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న యూపీఏ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కానీ మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదన్నారు.


రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్పా ఏమీ చేయలేదంటూ అమిత్ షా మండిపడ్డారు. పరిపాలన అంటే మోదీని చూసి నేర్చుకోవాలన్నారు. దాయాది పాక్ తోక జాడించి మన సైన్యంపై, సిబ్బందిపై దాడులు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ తో సమాధానం చెప్పిందని గుర్తుచేశారు. దేశాన్ని కాపాడే బాధ్యతను ప్రధాని మోదీ తీసుకున్నారు. అంతర్గత భద్రత పటిష్టం చేయడంతో తో పాటు పొరుగు దేశాల నుంచి దాడుల భయం లేకుండా చేసిన ఘనత మోదీ సొంతమన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మోదీ మోదీ అంటూ అక్కడ నినాదాలు చేస్తున్నారు. 


రైతుల సంక్షేమ ప్రభుత్వం నడిపిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారు. కానీ దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు అమిత్ షా. ఇది చూసైనా ఏపీ సీఎం జగన్ సిగ్గు పడాలన్నారు. 9 ఏళ్లలో 70 కోట్ల పేదల కోసం పక్కా ఇళ్లు సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. 9 కోట్ల పేదలకు 13 కోట్ల ఉచిత సిలిండర్లు అందించామన్నారు. ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో రూ.6000 జమ చేస్తున్నారు. మోదీ ఇస్తున్న ఈ డబ్బును తాను ఇస్తున్నానని చెప్పి సీఎం జగన్ రైతులను మభ్యపెడుతున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు.



ప్రతి పేదవాడి ఇంటికి కరెంట్ ఇస్తున్నాం, ఉచిత బియ్యం మేం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ బొమ్మ ఎలా వేస్తుందని అమిత్ షా ప్రశ్నించారు. రైతులకు కనీస మద్దతు ధరను రూ.1400 నుంచి రూ.2 వేల రూపాయలకు పెంచింది బీజేపీ అన్నారు. కరోనా సమయంలో ప్రధాని మోదీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 2 డోసుల వ్యాక్సిన్ ఇచ్చారని చెప్పారు. విశాఖలో అధికార పార్టీ నేతలు భూ దందా చేస్తున్నారు, మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారు. 10 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం రూ.78 వేల కోట్లు గ్రాంట్ గా ఇచ్చింది. కానీ మోదీ ప్రభుత్వం రూ.2 లక్షల 30 వేల కోట్లు అందించిందని చెప్పారు. తమ ప్రభుత్వం మూడు రెట్లు డబ్బు ఇస్తే, ఆ మనీ ఎక్కడికి పోయింది. జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సాగర మాల లో భాగంగా ఏపీకి అదనంగా రూ.85 వేల కోట్లను కేంద్రం ఇచ్చిందని అమిత్ షా ప్రస్తావించారు.


2 వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సికింద్రాబాద్ నుంచి విశాఖకు, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అందుబాటులోకి తెచ్చామన్నారు. వైజాగ్ రైల్వే స్టేషన్ ను రూ.450 కోట్ల ఖర్చుతో ఆధునికీకరిస్తున్నాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు కావాల్సిన అనుమతులు ఇచ్చాం. కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి నగరాలను స్మార్ట్ సిటీలుగా కేంద్రం డెవలప్ చేస్తోంది. విశాఖ, అనంతపురంలో మల్టీ పర్పస్ లాజిస్టిక్ పార్కులు చేస్తాం. తిరుపతిలో ఐఐటీ, విశాఖపట్నంలో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్, తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, తిరుపతిలో ఐఐఎస్డీఆర్, కాకినాడలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, 3 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం ఏపీకి మంజూరు చేసిందన్నారు. మోదీ మరోసారి 300 సీట్లు సాధించి ప్రధాని అవుతారని, అయితే ఏపీ నుంచి 25 సీట్లు గెలిపించాలని ఏపీ ప్రజలను అమిత్ షా కోరారు.