Vizianagaram News: రహదారి విస్తరణ పనుల్లో జాప్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు ఛత్తీస్ గఢ్, ఒడిశాలో ఉన్న 43వ జాతీయ రహదారి-26 గా మారుస్తూ.. కేంద్ర ప్రభుత్వం విస్తరణ పనులను చేపట్టింది. అయితే వాహనాల రద్దీ కారణంగానే ఈ పనులను పునరుద్ధరించింది. ఇందులో భాగంగానే 2 లైన్ల రోడ్డును 4 లైన్ల రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఏపీలో విజయనగరం జిల్లా నాతవలస నుంచి మన్యం జిల్లా సాలూరు మండలం కొట్టక్కి వరకు వ్యాపించిన ఈ రోడ్డు విస్తరణ పనులను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. అయితే కరోనా కారణంగా మొదట్లో పనులు సరిగ్గా సాగలేదు. కానీ ఆ తర్వాత రహదారి విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టారు. విజయనగరం, రామభద్రపురం మార్గాల్లో పనులు పూర్తి చేశారు. గజపతి నగరంలో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయి. చాలా జాప్యం జరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 


గజపతినగరంలో 2 కిలో మీటర్ల మేర వ్యాపించిన రహదారి విస్తరణ పనులు తీవ్ర అస్తవ్యస్తంగా మారాయి. క్రమ పద్ధతిలో కాకుండా అక్కడక్కడా పనులు ప్రారంభించడంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నడిచి వెళ్లే ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనాలు, ఆటోలు నడిపే వాళ్లు మరింత ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి పక్కన కాలువల నిర్మాణం పూర్తి చేయక పోవడంతో మురుగు సమస్య ఏర్పడుతుంది. గజపతి నగరంలోని ప్రధాన వీధుల మీదుగా వచ్చే మురుగు నీరు బహిరంగ ప్రాంతానికి ప్రవహించే మార్గం లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. కారణంగా పరిసర ప్రాంతాలన్నీ దుర్గంద భరితంగా మారాయని స్థానికులు వాపోతున్నారు. రాబోయేది వర్షాకాలం కావడంతో పట్టణ వాసులు మరింత భయపడుతున్నారు. ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.