ఏపీలోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 17 వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నప్పటికీ ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. జూన్ 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూలు ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.


అకడమిక్ క్యాలెండర్ విడుదల..
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరానికి (2023-24) సంబంధించిన పాఠశాల అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని అన్ని పాఠశాలలు జూన్ 12 నుంచి తెరుచుకోనున్న నేపథ్యంలో.. పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీనిప్రకారం కొత్త విద్యా సంవత్సరంలో 229 రోజులు పాఠశాలలు పని చేయనున్నాయి. మొత్తం 88 సెలవులు వచ్చాయి. 


ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. రెండు విభాగాలకు చివరి పీరియడ్‌ను క్రీడలకు ఆప్షనల్‌గా పేర్కొన్నారు. ఇక ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటాయి. పర్యావరణ విద్య సబ్జెక్టును 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం టీచర్, 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం టీచర్ చెప్పాలని విద్యాశాఖ సూచించింది. 


ఇంగ్లిష్ టీచర్లతో పాటు డిగ్రీ, పీజీలో ఆంగ్ల సబ్జెక్టు చదివిన వారందరూ టోఫెల్ బోధనలో సహాయకులుగా ఉండాలని పేర్కొంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో టోఫెల్ పరీక్ష నిర్వహించాలని సూచించింది. శనివారం రెండో శనివారం అయితే శుక్రవారమే పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఒకటి, రెండు తరగతులకు మొదటి, రెండు శనివారాల్లో నో బ్యాగ్ డేను అమలు చేయాలని క్యాలెడర్‌లో పేర్కొన్నారు. 


విద్యాసంవత్సరం సెలవులు ఇవే..


➥ దసరా సెలవులు అక్టోబరు 14 నుంచి 24 వరకు ఇస్తారు.


➥ నవంబరు 12న దీపావళి


➥ డిసెంబరు 25న క్రిస్మస్


➥ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 18 వరకు


➥ క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 21 నుంచి 24 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబరు 17 నుంచి 26 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఇస్తారు.


పరీక్షల తేదీలు ఇలా..


➥ ఫార్మాటివ్-1(సీబీఏ) పరీక్షలు 1-9 తరగతులకు ఆగస్టు 1-4, ఫార్మాటివ్-2 అక్టోబరు 3 - 6 వరకు నిర్వహిస్తారు.


➥  సమ్మేటివ్-1 (SA1) పరీక్షలు నవంబరు 4 - 10 వరకు, ఫార్మాటివ్-3 (సీబీఏ) జనవరి 3 - 6 మధ్య, ఫార్మాటివ్-4 పరీక్షలను ఫిబ్రవరి 23-27 వరకు నిర్వహిస్తారు.


➥  పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 23-29, సమ్మేటివ్-2, సీబీఏ-3 పరీక్షలు ఏప్రిల్ 11-20 వరకు నిర్వహిస్తారు.


Also Read:


తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల
తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రభుత్వం జూన్ 6న విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో  1 నుంచి 10వ తరగతులకు కొత్త అకడమిక్ క్యాలెండర్ వర్తించనుంది. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్‌ 12న ప్రారంభమై.. ఏప్రిల్‌ 23న ముగియనున్నాయి. అంటే ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.
అకడమిక్ క్యాలెండర్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..