హైదరాబాద్ సరూర్ నగర్‌లో సంచలనం రేపిన అప్సర అనే యువతిని పూజారి హత్య చేసిన కేసులో సంచలన విషయం ఒకటి బయటికి వచ్చింది. అప్సరకి గతంలోనే వివాహం జరిగిన విషయం తెరపైకి వచ్చింది. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ హత్య కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా.. మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.


భర్తతో విభేదాల కారణంగా అప్సర పుట్టింట్లోనే ఉంటోందని తెలుస్తోంది. జాతకం కోసం సాయిక్రిష్ణ వద్దకు వెళ్లగా, వీరిమధ్య పరిచయం ఏర్పడిందని గుర్తించారు. జాతకంలో ఉన్న దోషాలు పోవడానికి సాయిక్రిష్ణ వివిధ రకాల పూజలు ప్రతిపాదించారని, ఆ పూజలు ఆయనే జరిపించినట్లు సమాచారం. అలా పూజలతో అప్సరకు సాయిక్రిష్ణ మరింత దగ్గరైనట్లు తెలిసింది. 


సరూర్‌నగర్‌లో ఉంటున్న సాయికృష్ణ... అదే ప్రాంతంలో అద్దెకు ఉంటున్న అప్సర అనే అమ్మాయితో వివేహాతర సంబంధం పెట్టుకున్నాడు. బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా ఉంటూ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సాయికృష్ణతో అప్సరకు గుడిలో పరిచయం ఏర్పడింది. తరచూ అప్సర ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మను అక్క అంటూ పిలుస్తూ చనువుగా ఉండేవాడు. 


ఇది వరకు పెళ్లై ఓ పాపకు తండ్రి అయిన సాయికృష్ణతో అప్సర చాలా ప్రదేశాలకు వెళ్లేది. గోశాలలు, గుడులకు వెళ్లేవాళ్లు. ఈ తిరుగుళ్లు కారణంగా అప్సర ఓసారి గర్భవతి కూడా అయినట్టు తెలిసిన వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణపై అప్సర ఒత్తిడి తీసుకొచ్చిందని సమాచారం. 


అప్సర నుంచి ఒత్తిడి పెరగడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు సాయికృష్ణ. అనుకున్నట్టుగానే శంషాబాద్‌ ఏరియాకు తీసుకెళ్లి దారుణంగా హతమార్చాడు. కారులో ఆమె రిలాక్స్‌డ్‌ మూడ్‌లో ఉండగానే కారు కవర్‌ ఆమె మొహం వేసి ఊపిరి ఆడకుండా చేశాడు. తర్వాత తనతో తీసుకొచ్చిన రాయితో గట్టిగా తలపై  మోదాడు. అంతే స్పాట్‌లోనే ఆమె చనిపోయింది. 


చనిపోయిన అప్సర డెడ్‌బాడీని కారులోనే ఉంచేసి ఇంటికి వచ్చికారు పార్క్ చేశాడు. రెండు రోజుల పాటు డెడ్‌బాడీ ఆ కారులోనే ఉంది. రెండు రోజుల తర్వాత వాసన రావడంతో రాత్రి వేళ కారు తీసుకుని సరూర్‌నగర్‌ తహశీల్దార్‌ కార్యాలయం వెనుక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ వినియోగంలేని సెప్టిక్‌ ట్యాంక్‌లో మృతదేహాన్ని గన్నీ బ్యాగ్‌లో కుక్కి పడేశాడు. దీని తర్వాత రెండు బస్తాల ఉప్పు వేశాడు. ఆమె బ్యాగ్‌, లగేజీ బ్యాగ్ కాల్చేశాడు. కారును శుభ్రం చేసి సైలెంట్ అయిపోయాడు. 


తర్వాత రోజు 2 టిప్పర్ల మట్టి తెప్పించాడు. సెప్టిక్ ట్యాంకులో పోయించాడు. రెండు మ్యాన్‌హోల్స్‌ నుంచి దుర్వాసన రాకుండా జాగ్రత్తపడ్డాడు. మ్యాన్‌హోల్‌ మూతలు తీసుకొచ్చి మ్యాన్‌హోల్స్‌పై ఉంచి కాంక్రీట్‌ పోశాడు. ఆ సమీపంలో ఓ బోరు కూడా వేయించాడు. అది చూసిన వారంతా సాయి చేస్తున్నది సామాజిక సేవ అనుకున్నారే తప్ప అనుమానం రాలేదు. ఇప్పుడు అసలు విషయం తెలిసిన తర్వాత  షాక్ అయ్యారు. 


రిమాండ్ విధింపు
శుక్రవారం (జూన్ 9) అరెస్టైన సాయికృష్ణను శనివారం ఉదయం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న జడ్జి... నిందితుడు సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆతన్ని చర్లపల్లి జైలుకు అధికారులు తరలించారు.