CM Chandrababu in Visakhapatnam Woman assault case | విశాఖపట్నం: విశాఖలోని ఓ స్కానింగ్ సెంటర్లో మహిళను అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధిత మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇదివరకే కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రబాబు ఆదేశాలతో నిందితుడిని సెంట్రల్ జైలుకు తరలించారు.
మహిళపై వేధింపులు బాధాకరమన్న చంద్రబాబు
విశాఖపట్నం సిటీలోని ఓ హాస్పిటల్ లో స్కానింగ్ కోసం వెళ్లిన మహిళపై అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకు గాయం తగిలి స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించడం బాధాకరం అన్నారు. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన స్కానింగ్ సెంటర్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో విశాఖ 3వ టౌన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ స్కానింగ్ సెంటర్ ఇన్ ఛార్జ్ ప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎన్‌సీ 74, 76 సెక్షన్ల కింద నిందితుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు నిందితుడు ప్రకాష్‌కు రిమాండ్ విధించగా పోలీసులు అతడ్ని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
Also Read: Vizag Crime News: దెబ్బ తగిలిందని ఆస్పత్రికి వెళ్తే మహిళపై స్కానింగ్ సెంటర్ సిబ్బంది అసభ్య ప్రవర్తన
అసలేం జరిగిందంటే..
విశాఖపట్నంలో ఓ మహిళ తలకు తీవ్ర గాయమైందని చికిత్స కోసం సోమవారం రాత్రి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. ఆసుపత్రికి వచ్చిన ఆమెను పరీక్షించిన డాక్టర్లు స్కానింగ్ తీయించుకుని, రిపోర్ట్ తీసుకురావాలని సూచించారు. ఆ మహిళ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ సెంటర్‌కు వెళ్లింది. స్కానింగ్ కోసం వచ్చిన బాధితురాలి పట్ల స్కానింగ్ సెంటర్ ఇంఛార్జ్ ప్రకాష్ అసభ్యకరంగా ప్రవర్తించారు. తలకు గాయమైందని ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఆమెను స్కానింగ్ కోసం దుస్తులు విప్పేయాలని సూచించారు. అతడి మాటలు విన్న మహిళ షాకైంది. ఏం జరగనుందో అర్థం చేసుకున్న మహిళ అతడ్ని నిలదీసింది. తనతో స్కానింగ్ ఇంఛార్జ్ అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు వెంటనే గట్టిగా కేకలు వేసింది. ఇది విన్న చుట్టుపక్కల పేషెంట్లు పరుగన అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే వేధింపులకు పాల్పడిన స్కానింగ్ సెంటర్ ఇంఛార్జిని చితకబాదారు. మహిళలతో ప్రవర్తించే తీరు ఇదేనా మండిపడ్డారు.
బాధితురాలు తోటి పేషెంట్ల సూచన మేరకు పోలీసులకు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విశాఖపట్నం త్రీటౌన్ సీఐ రమణయ్య మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన స్కానింగ్ సెంటర్ ఇంఛార్జ్ ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని సీఎం చంద్రబాబు అన్నారు.