Mla Prakash Reddy : ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు ఇటీవల కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.  హత్యారాజకీయాలంటూ మొదలుపెడితే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ నుంచే మొదలు పెడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.  తన సోదరుడి వ్యాఖ్యలపై  రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి  విశాఖలో స్పందించారు. చంద్రబాబు ఫ్యాక్షన్ నైజాన్ని దృష్టిలో పెట్టుకుని తన తమ్ముడు మాట్లాడాడు అన్నారు.  తన తమ్ముడు మాట్లాడిన భాష తప్పు అని, భావం సరైనదే అన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గోబెల్స్ ప్రచారం చేస్తుందన్నారు. వైసీపీలో కొంత మంది ఎమ్మెల్యేల వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గెలవలేక బట్టకాల్చి మీద వేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రెచ్చగొట్టే చర్యలు కనిపిస్తున్నాయన్నారు.  


ఆవేదనతో అలా మాట్లాడారు 


"అనంతపురంలో పారిన నెత్తురు దాని వెనుక చంద్రబాబు హస్తం గురించి చర్చించాలి. ఎన్నికల తర్వాత రాప్తాడు ఏరియా ప్రశాంతంగా ఉంది. దానిని భగ్నం చేసేందుకు కుట్ర జరుగుతోంది. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ కి మరోసారి ఆజ్యం  పోసేలా తెలుగుదేశం పార్టీ చర్యలు ఉన్నాయి.  మనసు గాయపడి మా సోదరుడు మాట్లాడాడు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించొద్దు.  ఒక ఎమ్మెల్యేని ఎదుర్కొనే పద్ధతి ఇదేనా. మా కుటుంబాన్ని మమ్మల్ని వేధిస్తున్నారు. తమ్ముడిని ఏదైనా చేస్తారని  ఆవేదనతో, సోదరుడు అలా మాట్లాడి ఉంటాడు. చంద్రబాబును దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు పదే పదే ప్రచారం చేస్తున్నాయి. 2019 నుంచి ఒక్క రక్తపు చుక్క కూడా పడకుండా చూసుకున్నాం. పరిటాల రవీంద్ర చేసిన హత్యల వెనక, ప్రైవేట్ సైన్యాలు వెనక, బాంబుల దాడులు, ఆనాడు చంద్రబాబుకు కనబడలేదా? 150 మందిని ఊచ కోత కోస్తే ఖండించారా? అనేకమంది మీద బాంబు దాడుల చేసిన పరిటాల రవీంద్రను చంద్రబాబు ఎందుకు పక్కన పెట్టలేదు. "- ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి


పరిటాల శ్రీరామ్ బెదిరింపులు వెనక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రాప్తాడు ఎమ్మెల్యేకి టైం దగ్గర పడిందని మాట్లాడుతున్నారు అంటే చంపుతారని బెదిరిస్తారా? తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టడం కాదా?  అని ప్రశ్నించారు.  


టీడీపీ శ్రేణులు ఆందోళన 


ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న ప్రెస్ క్లబ్ వద్దకు  టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నాయకులు చేరుకుని ఆందోళన చేశారు. చంద్రబాబు, లోకేశ్ కు ప్రకాష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ కు భద్రత పెంచాలని కోరారు.  నిరసన చేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, తెలుగు యువత పెంటిరాజ్, వలిశెట్టి తాతాజీలు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 


టీడీపీ నేతలు అరెస్టు 


ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు రెండు రోజుల క్రితం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. హత్యారాజకీయాలంటూ మొదలుపెడితే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ నుంచే మొదలు పెడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో బత్తలపల్లి మండలానికి చెందిన టీడీపీ నేత గంటాపురం జగ్గు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ఆర్ధరాత్రికే ఆయన అరెస్టు, వైఎస్ఆర్ సీపీ నాయకులు దాడి చేయడం జరిగాయి. సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత గంటాపురం జగ్గును శనివారం (నవంబరు 26) అర్ధరాత్రి అరెస్టు చేయడం, వైఎస్ఆర్ సీపీ నాయకులు దాడి చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్తలు భారీగా స్టేషన్ ఎదుట బైఠాయించి జగ్గును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ పరిణామాలకు తోపుదుర్తి ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి బ్రదర్స్ కారణమని విమర్శించారు. వారు మాట్లాడిన మాటలు దిగజారుడుగా ఉన్నాయని పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.