Rare 555.55 carat black diamond Auction: ఆకాశం నుంచి ఊడిపడిన ప్యూర్‌ బ్లాక్ డైమండ్‌ గురించి మీకు తెలుసా.? ఆకాశం నుంచా..? అనే డౌట్‌ మీకు రావొచ్చు. కానీ మీరు చదివింది ముమ్మాటికి నిజం. ఇప్పుడు ఈ వజ్రం గురించే యావత్‌ ప్రపంచం చర్చిస్తోంది. భూమిపై ఇప్పటి వరకు గుర్తించిన వజ్రాలలో అత్యంత అరుదైనది, ఖరీదైన ఈ బ్లాక్ డైమండ్ విశ్వంలోని సుదూర ప్రాంతం నుంచి భూమికి చేరినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. గ్రహశకలాలు భూమిని తాకినప్పుడు, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో అత్యంత అరుదుగా ఈ బ్లాక్‌ డైమండ్స్‌ ఏర్పడతాయని వెల్లడించారు సైంటిస్టులు. కొన్ని నెలల నుంచి ఈ బ్లాక్ డైమండ్ గురించి సైంటిస్టులు, మేథావులు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎలా సాధ్యమవుతాయి, వీటికి కారణాలను కొందరు సైంటిస్టులు అన్వేషిస్తున్నారు.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బ్రెజిల్ లో అధికంగా లభ్యం
కోట్ల సంవత్సరాల కిందట రెండు ఖండాలు అనుసంధానమై సూపర్ కంటినెంట్ 'రోడినియా' ఏర్పడే క్రమంలో ఇటువంటి వజ్రాలు భూమి మీద పడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిని ఎనిగ్మా అంటారట. ప్రపంచంలోని బ్లాక్ డైమండ్స్ చాలా వరకు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బ్రెజిల్ నుంచి ఎక్కువగా లభిస్తుంటాయి. 3 బిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఇవి ఉద్భవించినట్లు చెబుతున్నారు సైంటిస్టులు. అంతేకాకుండా ఇవి చాలా అరుదుగా దొరుకుతుంటాయని అన్నారు. అయితే తెలుపు వజ్రాల కంటే భిన్నంగా వర్గీకరించబడతాయి. సహజమైన నలుపు రంగు కలిగి ఉండటం వల్ల ముదురుగా కనిపిస్తాయి. ఈ అత్యంత అరుదైన వజ్రాన్ని వేలం వేయబోతోన్నారు. 
బ్లాక్ డైమండ్ ఎన్ని కోట్లు పలుకుతుందో !
సహజసిద్ధంగా లభించిన ఈ వజ్రాన్ని దీని యజమాని రెండు దశాబ్దాల పాటు దీన్ని దాచి ఉంచి, తొలిసారిగా ఈ డైమండ్‌ను ప్రజలకు ప్రదర్శిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే.. పింక్‌, వైట్‌ డైమండ్స్‌ కన్న ఈ బ్లాక్‌ డైమండ్స్‌ను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారంటా. అంతేకాదు.. దీని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ మార్కెట్లో 90% బ్లాక్ డైమండ్స్ ఫేక్ గానే ఉంటాయి అందుకే వీటిని కొనేముందు ధృవీకరణ పత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 55 కోణాలు కలిగి ఉన్న ఈ వజ్రాన్ని వేలంలో ఉంచి, 50 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాదు.. ఇది 555.55క్యారెట్‌ డైమండ్‌ అని తెలిపారు వేలం నిర్వాహకులు. 


గతంలో దొరికిన పింక్ డైమండ్
అత్యంత ఖరీదైన వజ్రాల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వజ్రాల్లో పింక్ డైమండ్ చాలా అరుదు. అందుకే వాటికి ఇంకా ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అంగోలా వజ్రాల గ‌నుల్లో అతిపెద్ద పింక్ డైమండ్ ల‌భ్య‌మైంది. గ‌డిచిన 300 ఏళ్ల‌లో ఇలాంటి వ‌జ్రాన్ని చూడ‌లేద‌ని నిపుణులు ప్రకటించారు.  లూలా రోజ్‌గా పిలుస్తున్న ఆ వ‌జ్రం.. లూలో మైన్‌లో దొరికింది. అది 170 క్యారెట్ పింక్ డైమెండ్ అని లుకాపా డైమెండ్ కంపెనీ పరీక్షలు చేసి తేల్చింది.  అతి స‌హ‌జ‌మైన రీతిలో దొరికిన అతి అరుదైన వజ్రాన్ని పొందడంపై అంగోలా ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.  లూలో మైన్ నుంచి పింక్ వ‌జ్రం ల‌భించ‌డం ఇది రెండ‌వ‌సారి. అంగోలాలో ఉన్న ఈ మైన్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కారణంగా ఈ వజ్రంపై రెండు దేశాలకూ హక్కు ఉంటుంది. లూలో రోజ్ వ‌జ్రాన్ని క‌టింగ్‌, పాలిషింగ్ చేయాల్సి ఉంటుంది. దాని వ‌ల్ల ఆ వ‌జ్రం బ‌రువు 50 శాతం త‌గ్గిపోతుంది. గ‌తంలో 59.6 క్యారెట్ల పింక్ స్టార్ వ‌జ్రాన్ని హాంగ్‌కాంగ్ వేలంలో సుమారు 71.2 మిలియ‌న్ల డాల‌ర్ల‌కు అమ్మేశారు.