Kapu Leaders Meet: విశాఖలో కాపు(Kapu) నేతల కీలక సమావేశం జరిగింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. సామాజికంగా ఆర్థికంగా కాపులు ఎదగడానికి రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ దిశగా కాపు నేతలు అడుగులు వేస్తున్నారు. బహుజనులను కలుపుకుని ముందుకు సాగాలనేది వీరి ఉద్దేశం. కాపు, బహుజనుల్లో ఉన్న రాజకీయ, సామాజిక అసమానతలను తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని మాజీ డీజీపీ సాంబ శివరావు(Sambashiva Rao) అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేదిక ఉండాలనేది సంకల్పంగా ఫోరం ఫర్ బెటర్ ఏపీని ప్రారంభించామని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta Srinivas Rao), వట్టి వసంత్ కుమార్, బోండా ఉమా, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు, పలువురు కాపు నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాపులు రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే వ్యూహంపై చర్చించనట్లు తెలుస్తోంది.
ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ
గత రెండు నెలలుగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులందరూ కలిసి కాపు వర్గం, ఇతర సామాజిక వర్గాల్లో సామాజిక, ఆర్థిక అసమానలతలను ఎలా తొలగించాలనే విషయంపై చర్చిస్తున్నామని మాజీ డీజీపీ సాంబ శివరావు అన్నారు. ఈ ఉద్దేశంపై ప్రధానంగా చర్చ జరిగింది. కాపు, బహుజనులలో ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని ఏవిధంగా పరిష్కరించాలని చర్చించామన్నారు. వారి అభివృద్ధి కోసం ఏంచేయాలనే విషయాలపై చర్చించామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందర్నీ దృష్టిలో పెట్టుకుని ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ(Forum for better AP) ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజకీయ వివక్షపై చర్చించామన్నారు. ఎంతమందిని రాజకీయ పరంగా ఎంపవర్ చేయగలమనే విషయాలపై చర్చించామన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఈ ఫోరమ్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దీనికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ ఫోరమ్ కేవలం రాజకీయ రంగులోనే కాకుండా ఇతర సమస్యల పరిష్కారానికి వినియోగిస్తామన్నారు. బహుభన కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉపయోగపడేలా దీనిని తీర్చిదిద్దుతామన్నారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ల అంశం చర్చకు వచ్చినా ప్రధానంగా చర్చించిన అంశం రాజకీయ, ఆర్థిక అసమానలతలపై అని సాంబశివరావు పేర్కొన్నారు. ఉత్తరాధిలో జరిగిన రాజకీయ కూర్పు లాంటిది ఈ ఫోరమ్ అన్నారు.
నూతన పంథాలో రాజకీయాలు
గత కొంత కాలంలో కాపు నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే కాపు నేతలు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారన్న వార్తలు వినిపించాయి. కానీ దీనికి స్పష్టత ఇవాళ వచ్చింది. కాపు నేతలు ఐస్ బ్రేక్ చేస్తూ ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కాపు బహుజన వర్గాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అనంతరం రాజకీయ టర్న్ తీసుకునే అవకాశం ఉందన్నారు. పీఆర్పీ(PRP) విఫలప్రయత్నం కాదని, కానీ ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైందన్నారు. ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ నూతన పంథాలో ముందుకు వెళ్తుందన్నారు. సామాజిక పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.