Nitin Gadkari : విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ... 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ సాగిస్తున్న పయనంలో ఏపీ కీలకమని  కేంద్ర నితిన్ గడ్కరీ తెలిపారు. 975 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్, భారత గ్రోత్ స్టోరీలో భాగస్వామ్యం అవుతుందన్నారు. తీరం వెంబడి ఆరు పోర్టులు కలిగి, మరో నాలుగు నిర్మాణంలో ఉన్న ఏపీ... దేశ లాజిస్టిక్ రంగంలో కీలక భాగస్వామ్యం కలిగి ఉందన్నారు. రాష్ట్రంలోని పోర్టులన్నింటినీ నాలుగు లేన్ల జాతీయ రహదారులతో అనుసంధానం చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు. దేశ అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ కీలకమని   రాష్ట్రంలోని పోర్టులన్నింటినీ నాలుగు లేన్ల జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రం నుంచి వెళ్లేలా 5 గ్రీన్ ఫీల్డ్ జాతీయ  రహదారులను నిర్మిస్తున్నామని, దీనికోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని అందులో భాగంగానే ఈ తొమ్మిదేళ్లలో 4200 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులను 8700 కిలోమీటర్లకు పెంచామని చెప్పారు. 


ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు 


దేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఏపీ ఒకటని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.  ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు.  ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ హయాంలో రహదారుల అభివృద్ధి వేగం పుంజుకున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ పోర్ట్‌ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఏపీలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పోర్టులతో రహదారులను అనుసంధానం చేస్తామన్నారు. పరిశ్రమలకు లాజిస్టిక్‌ ఖర్చులు తగ్గించడం చాలా ముఖ్యం అన్న గడ్కరీ.. ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు రాబోతున్నాయని తెలిపారు. ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఛార్జీలను తగ్గించి ప్రజా రవాణాను ప్రోత్సహించాలని ఆయన సూచించారు.


రూ.30 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రహదారులు 


" 2014కి ముందు ఏపీలో 4193 కి.మీ.ల పొడవున జాతీయ రహదారులుంటే... 2014లో మోదీ ప్రధాని అయ్యాక ఆయన నేతృత్వంలో ఏపీలో 109% జాతీయ రహదారుల పొడవు పెరిగింది. ఇప్పుడు అది 8745 కి.మీ. పారిశ్రామిక అభివృద్ధికి చాలా ముఖ్యమైన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను తయారు చేస్తున్నాము. ఏపీలో 5 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేస్ అభివృద్ధి చేయబోతున్నాం. మొత్తం గ్రీన్‌ఫీల్డ్ పొడవు 662 కిమీ. దాని కోసం 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ముఖ్యమైన హైవే చాలా ముఖ్యమైనది ఎందుకంటే... ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వరకు రైల్వేలో సరుకుల రవాణాకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. రాయ్‌పూర్ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్‌ను నిర్మించాలని ఆ సమయంలో నిర్ణయించారు.  2024 ముగిసేలోపు ఈ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభిస్తాం. " - నితిన్ గడ్కరీ 


ఏపీలో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన


గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 340 పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ పెట్టుబడులతో 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి యువతకు ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ విశాఖ జీఐఎస్ సదస్సులో తెలిపారు. ఏపీకి రూ.13 లక్షల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు పోర్టులు, ఆరు ఎయిర్ పోర్టులతో అధిక మానవ వనరుల శక్తి ఏపీ కలిగి ఉందని సీఎం  జగన్ పారిశ్రామిక వేత్తల దృష్టికి తీసుకెళ్లారు. దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి ఉన్న రాష్ట్రం ఏపీ అని సీఎం చెప్పారు.