IND vs AUS 3rd Test: 


ఇండోర్‌ టెస్టులో కొద్దిగా వెనుకంజ వేశామని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అన్నాడు. ప్రణాళికలను అనుకున్న రీతిలో అమలు చేయలేకపోయామని పేర్కొన్నాడు. 9 వికెట్ల తేడాతో ఓటమి ఘోర పరాభవమేమీ కాదన్నాడు. తమ బృందమంతా కలిసి ఆటతీరుపై సమీక్షించుకుంటామని వెల్లడించాడు. మూడో టెస్టులో ఓటమి తర్వాత హిట్‌మ్యాన్‌ మీడియాతో మాట్లాడాడు.


'సవాళ్లు విసిరే పిచ్‌పై ఆడుతున్నప్పుడు సరిగ్గా బౌలింగ్‌ చేయాలి. మేం ప్రత్యర్థి బౌలర్లను ఒకే చోట బంతులేసేందుకు అనుమతించాం. అయితే ఈ ఘనతకు వారు అర్హులే. ప్రత్యేకించి నేథన్‌ లైయన్‌. మేం ధైర్యంగా పోరాడాల్సింది. కానీ చేయలేకపోయాం' అని రోహిత్‌ అన్నాడు. రెండో ఇన్నింగ్సులో లైయన్‌ (Nathan Lyon) 64 పరుగులిచ్చి 8 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.


'అనుకున్న వ్యూహాలను ఒకేరీతిలో అమలు చేయనప్పుడు ఇలాంటి ఓటములు ఎదురవుతుంటాయి. ఏదేమైనా ఆటగాళ్లంతా ఏకతాటిపై ఉండేలా చేయాలి. తలెత్తుకొనే ఉండాలి. కొందరు క్రికెటర్లు నిలబడాలని మేం కోరుకున్నాం. కానీ జరగలేదు. కొద్దిగా వెనకబడ్డాం. ఒక టెస్టు మ్యాచు ఓడిపోయారంటే చాలా అంశాలు కలిసిరాదనే చెప్పాలి. మొదట తొలి ఇన్నింగ్సులో బ్యాటింగ్‌ సరిగ్గా చేయలేదు. అప్పుడు పరుగులు చేయడం ఎంత ముఖ్యమో మాకు తెలుసు' అని హిట్‌మ్యాన్‌ చెప్పాడు.


'తొలి ఇన్నింగ్సులో ఆసీస్‌కు 80-90 పరుగుల ఆధిక్యం లభిస్తే రెండో ఇన్నింగ్సులో మేం అద్భుతంగా ఆడాల్సింది. కానీ బ్యాటింగ్‌ చేయలేకపోయాం. అహ్మదాబాద్‌ టెస్టుపై ఇప్పడైతే ఏమీ ఆలోచించలేదు. ఇప్పుడే కదా ఇండోర్‌ మ్యాచ్‌ ముగిసింది. మేమంతా కలిసి సమీక్షించుకుంటాం. ఒక బృందంగా మేం మరింత మెరుగవ్వాలని అర్థం చేసుకున్నాం' అని రోహిత్‌ వివరించాడు.


IND vs AUS, 3rd Test: 


నెర్రెలు వాసిన పిచ్‌! బంతిని గింగిరాలు తిప్పించే స్పిన్నర్లు! మైండ్‌ గేమ్‌ ఆడితే గెలవచ్చేమో అనే ఆశలు! ఇండోర్‌ టెస్టు మూడో రోజు ఆట మొదలయ్యేముందు టీమ్‌ఇండియా సిచ్యువేషన్‌ ఇదీ! కానీ అద్భుతమేమీ జరగలేదు. అసాధ్యం సుసాధ్యం అవ్వలేదు. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ సునాయాసంగా ఛేదించేసింది. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించేసింది. ఆఖరి టెస్టుకు కొండంత ఆత్మవిశ్వాసం సాధించేసింది. ట్రావిస్‌ హెడ్‌ (49; 53 బంతుల్లో 6x4, 1x6), మార్నస్‌ లబుషేన్‌ (28; 58 బంతుల్లో 6x4) ఎలాంటి 'కంగారూ' లేకుండా ఆసీస్‌ను గెలిపించేశారు.


వికెట్లు పడలేదు!


మూడో రోజు, శుక్రవారం ఆసీస్‌ తాజాగా ఛేదనకు దిగింది. పరుగుల ఖాతా తెరవక ముందే ఉస్మాన్‌ ఖవాజా (0)ను అశ్విన్‌ ఔట్‌ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఎడమచేతి వాటం బ్యాటర్లను పదేపదే ఇబ్బంది పెట్టాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్‌ లబుషేన్‌తో కలిసి ట్రావిస్ హెడ్‌ కుదురుగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. టీమ్‌ఇండియా స్పిన్నర్లను ఆచితూచి ఎదుర్కొన్నాడు. పది ఓవర్ల తర్వాత వీరిద్దరూ దూకుడు పెంచారు. దొరికిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించి ఆత్మవిశ్వాసం సాధించారు. ఆపై నిర్భయంగా షాట్లు ఆడేసి 18.5 ఓవర్లకు ఆసీస్‌కు 9 వికెట్ల తేడాతో విజయం అందించారు. మరో 3 వికెట్లు పడుంటే ఆట రసవత్తరంగా ఉండేది.