ICC WTC Final:
ఆశించింది ఒకటి! జరిగింది మరోటి! ఇండోర్ టెస్టు గెలిచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలని టీమ్‌ఇండియా (Team India) భావించింది. కానీ ఈ పోరులో విజయకేతనం ఎగరేసిన ఆస్ట్రేలియా తొలుత చోటు సంపాదించింది. ఇప్పుడు భారత్‌కు నాలుగో టెస్టు కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే శ్రీలంక రూపంలో గండం పొంచివుంది.
ఇండోర్ టెస్టులో 9 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్‌కు (WTC Final) దూసుకుపోయింది. 2021-23 సైకిల్లో తనకు తిరుగులేదని చాటుకుంది. మొత్తంగా 18 మ్యాచుల్లో 11 గెలిచింది. మూడో టెస్టు గెలుపుతో ఆసీస్ 68.52 పాయింట్లతో ఛాంపియన్‌షిప్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక వాళ్లనెవరూ వెనక్కి నెట్టే పరిస్థితి లేదు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. తన ఖాతాలో 60.29 పాయింట్లు ఉన్నాయి. అయితే ఈ ఛాంపియన్‌షిప్ సైకిల్లో తనకు మిగిలింది ఇంకొక్క మ్యాచే. అహ్మదాబాద్ టెస్టులో గెలిస్తే మిగతా సమీకరణాలతో పన్లేకుండానే జూన్‌లో ఓవల్‌లో ఆసీస్‌తో ఫైనల్ ఆడుతుంది. ఒకవేళ డ్రా అయినతే శ్రీలంక ఓటముల కోసం నిరీక్షించాల్సి వస్తుంది.
ఈ నెలలో శ్రీలంక ఇంకా రెండు టెస్టులు ఆడుతుంది. న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. సొంతగడ్డపై కివీస్ ఎంత పటిష్ఠంగా ఉంటుందో తెలిసిందే. ఇప్పటికైతే వారు గెలిచే సూచనలు కనిపించడం లేదు. కేన్ విలియమ్సన్ సారథ్యం నుంచి తప్పుకున్నాక న్యూజిలాండ్ ఇబ్బంది పడుతోంది. ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. ఇందులో శ్రీలంక ఒక్క మ్యాచ్ ఓడిపోయినా టీమ్‌ఇండియా ఫైనల్‌కు వెళ్లడం ఖాయమే.
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మిగిలున్న మ్యాచులు
దక్షిణాఫ్రికా v వెస్టిండీస్ (రెండో టెస్టు) - జొహనెస్ బర్గ్ వేదిక
న్యూజిలాండ్ v శ్రీలంక (తొలి టెస్టు) - క్రైస్ట్‌చర్చ్
భారత్ v ఆస్ట్రేలియా (నాలుగో టెస్టు) - అహ్మదాబాద్
న్యూజిలాండ్ v శ్రీలంక (రెండో టెస్టు) - వెల్లింగ్టన్
IND vs AUS, 3rd Test:
నెర్రెలు వాసిన పిచ్! బంతిని గింగిరాలు తిప్పించే స్పిన్నర్లు! మైండ్ గేమ్ ఆడితే గెలవచ్చేమో అనే ఆశలు! ఇండోర్ టెస్టు మూడో రోజు ఆట మొదలయ్యేముందు టీమ్‌ఇండియా సిచ్యువేషన్ ఇదీ! కానీ అద్భుతమేమీ జరగలేదు. అసాధ్యం సుసాధ్యం అవ్వలేదు. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సునాయాసంగా ఛేదించేసింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించేసింది. ఆఖరి టెస్టుకు కొండంత ఆత్మవిశ్వాసం సాధించేసింది. ట్రావిస్ హెడ్ (49; 53 బంతుల్లో 6x4, 1x6), మార్నస్ లబుషేన్ (28; 58 బంతుల్లో 6x4) ఎలాంటి 'కంగారూ' లేకుండా ఆసీస్‌ను గెలిపించేశారు.
వికెట్లు పడలేదు!
మూడో రోజు, శుక్రవారం ఆసీస్ తాజాగా ఛేదనకు దిగింది. పరుగుల ఖాతా తెరవక ముందే ఉస్మాన్ ఖవాజా (0)ను అశ్విన్ ఔట్ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఎడమచేతి వాటం బ్యాటర్లను పదేపదే ఇబ్బంది పెట్టాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్ లబుషేన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ కుదురుగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. టీమ్‌ఇండియా స్పిన్నర్లను ఆచితూచి ఎదుర్కొన్నాడు. పది ఓవర్ల తర్వాత వీరిద్దరూ దూకుడు పెంచారు. దొరికిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించి ఆత్మవిశ్వాసం సాధించారు. ఆపై నిర్భయంగా షాట్లు ఆడేసి 18.5 ఓవర్లకు ఆసీస్‌కు 9 వికెట్ల తేడాతో విజయం అందించారు. మరో 3 వికెట్లు పడుంటే ఆట రసవత్తరంగా ఉండేది.