Visakha Airport Incident : విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ నేతల కార్లపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలు మంత్రులు, వైసీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ దాడి ఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. విమానాశ్రయంలో జరిగిన ఉద్రిక్తతపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. పవన్‌ కల్యాణ్ పర్యటన నుంచి దృష్టి మళ్లించేందుకే కోడికత్తి తరహాలో వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. దాడి చేసింది జనసేన కార్యకర్తలేనని పోలీసులు నిర్థారించలేదని స్పష్టం చేశారు. దాడులకు పాల్పడే సంస్కృతిని జనసేన ఎప్పుడూ ప్రోత్సహించదన్నారు. ఇద్దరు మంత్రులపై దాడి జరిగినట్లు వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. మంత్రుల వాహనాలపై దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని నాదెండ్ల ప్రశ్నించారు.


దాడులు చేస్తే.. ప్రతిదాడులు జరుగుతాయ్- స్పీకర్ తమ్మినేని సీతారాం 


విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనపై ఏపీ ప్రభుత్వం, వైఎస్‌ఆర్‌సీపీ సీరియస్‌గా తీసుకున్నాయి. దాడిని తీవ్రంగా ఖండించాయి. దాడి చేసిన వాళ్లను వదిలి పెట్టే సమస్య లేదంటున్నారు మంత్రులు. విశాఖ గర్జన ముగించుకొని మంత్రి జోగి రమేష్‌, రోజా, ఇతర వైసీపీ లీడర్లు వెళ్తున్న టైంలో జన సైనికులు దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. విశాఖ ఎయిర్‌పోర్టులో లీడర్ల కార్ల అద్దాలు ధ్వంసం చేశారని చెబుతోంది. దీనికి పూర్తి బాధ్యత పవన్ కల్యాణ్‌దేనంటున్న వైసీపీ... సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. మంత్రులపై జరిగిన దాడి అవాంఛనీయ సంఘటనగా అభివర్ణించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆ దాడిని పూర్తిగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకూడదన్నారు. విమర్శ, ప్రతివిమర్శతోనే ఏ వివాదమైనా సద్దుమణిగిపోవాలి కానీ ఇలాంటి దాడులు సరికావు అని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర ఆకాంక్ష వైజాగ్‌ను రాజధానిగా ప్రకటించడమేనన్నారు స్పీకర్ తమ్మినేని. అలాంటి కోరికతో పెద్ద ఎత్తున సభ జరిగితే..దానిని వ్యతిరేకంగా జరిగిన దాడిగా ఈ ఘటనను చూస్తున్నామన్నారాయన. మంత్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్య తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి దాడులు చేస్తే..మరింత తీవ్రంగా ప్రతి దాడి జరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. అందుకే అందరూ సంయమనం పాటించాలని కోరారు.


విశాఖలో ఉద్రిక్తత 


విశాఖ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విమానాశ్రయం వద్ద వైసీపీ నేతల వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. విశాఖలో జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ శనివారం సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పవన్‌ కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు జనసేన శ్రేణులు ఎయిర్ పోర్టుకు భారీగా చేరుకున్నారు. అదే టైంలో విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్లేందుకు మంత్రులు జోగి రమేశ్‌, రోజా, మాజీ మంత్రి పేర్ని నాని, ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త  వైవీ సుబ్బారెడ్డి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వైసీపీ నేతల వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ ఘటనలో వైవీ సుబ్బారెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయినట్లు సమాచారం. మంత్రి రోజా భద్రతా సిబ్బందిలో ఒకరికి రాయి తగిలి గాయమైంది. అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో కాసేపు ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. 


Also Read : విశాఖ ఎయిర్‌పోర్టులో టెన్షన్ టెన్షన్- మంత్రులను చుట్టుముట్టిన జనసైనికులు