Gujarat Election 2022:


5 గంటల పాటు మీటింగ్..


ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. అధికార భాజపా ఇప్పటికే ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాని మోదీ సొంత ఊరు కావటం వల్ల ఇక్కడ గెలవటం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది కాషాయ పార్టీ. అంతే కాదు. తప్పకుండా గెలుస్తామన్నధీమాతోనూ ఉంది. అటు ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా ఈ సారి బరిలోకి దిగనుంది. కాంగ్రెస్‌ పోటీతో గుజరాత్‌లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. అయితే...మిగతా రెండు పార్టీల కంటే భాజపా ఓ అడుగు ముందుకేసి వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో కీలక నేతలంతా భేటీ అయ్యారు. గుజరాత్ ఎన్నికల్లో ఏయే వ్యూహాలతో ముందుకెళ్లాలో ఈ భేటీలో చర్చించారు. కేంద్రహోం మంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశానికి హాజరయ్యారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఈ భేటీలో పాల్గొని అధిష్ఠానంతో చర్చించారు. దాదాపు 5 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఏ ప్రాతిపదికన గుజరాత్‌లో భాజపా అభ్యర్థులను నిలబెట్టాలో ఈ సమావేశంలో చర్చించినట్టు ABP Newsకి విశ్వస నీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేమిటో ప్రస్తావించారు. ఆ అంశాలనే అజెండాలుగా మార్చుకుని ప్రచారం కొనసాగించాలని భాజపా భావిస్తున్నట్టు సమాచారం.


ఇక రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి...ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. అక్టోబర్ 18, 19వ తేదీల్లో ప్రధాని మోదీ గుజరాత్‌లో పర్యటించనున్నారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భాజపాకు దీటుగా ప్రచారం చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే పంజాబ్‌లో గెలిచిన ఊపుతో ఉన్న ఆ పార్టీ..అదే ఉత్సాహంతో గుజరాత్‌లోనూ భాజపాను ఢీకొట్టేందుకు రెడీగా ఉంది. భాజపాను ఓడించటం అంత సులభమేమీ కాకపోయినా...కనీసం గట్టిపోటీ ఇచ్చినా అది తమ విజయమే అని ఆప్‌ భావిస్తోంది. అందుకే...ఈ సారి ఆప్, భాజపా మధ్య ప్రధాన పోటీ కనిపించేలా ఉంది. 


ఎవరి వ్యూహాలు వారివి..


ఎన్నికల తేదీలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా తరచు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చి తన కంచుకోటను కాపాడుకోవాలని భాజపా గట్టి సంకల్పంతో ఉంది. అటు...కాంగ్రెస్ గుజరాత్‌లో అధికారం కోల్పోయి 27 ఏళ్లు దాటింది. ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు అనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టి...ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలని హస్తం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా భాజపాకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమ వుతోంది. గుజరాత్‌లో ఆప్ గెలిస్తే...కేజ్రీవాల్ తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకుని 2024 ఎన్నికల్లో మోదీతో తలపడే అవకాశాలు చాలానే ఉన్నాయి. అందుకే...గుజరాత్‌లో గెలవటాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఆప్. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఆప్ మంచి ఫలితాలు రాబడితే...పాన్ ఇండియా పార్టీగా ముద్ర పడిపోతుంది. ప్రస్తుతానికి...ఆప్, కాంగ్రెస్, భాజపా మధ్య త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ మూడు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు తరచూ గుజరాత్‌లో పర్యటిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ పార్టీల ప్రకటనలకు సంబంధించిన ఫ్లెక్సీలతోనే నిండిపోయాయి. 


Also Read: TDP Support BJP : మునుగోడులో బీజేపీకి టీడీపీ మద్దతు - చంద్రబాబును కలవనున్న రాజగోపాల్ రెడ్డి !