AP News : శ్రీ సత్యసాయి జిల్లా మలుగూరులో విషాదం చోటు చేసుకొంది. ఇంటి పైకప్పు కూలి మూడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా తడిచిపోయింది. శుక్రవారం కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో మిద్దె  పైకప్పు ఒక్కసారిగా కూలింది.  శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం మలుగూరు గ్రామానికి చెందిన చంద్రప్ప కుటుంబ సభ్యులు శుక్రవారం అర్ధరాత్రి నిద్రిపోతున్న సమయంలో నాలుగు రోజులుగా తడిసిన మిద్దె ఒకసారిగా కూలిపోయింది. అప్రమత్తమైన చంద్రప్ప కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. అయితే పైకప్పు కింద చిక్కుకున్న బాలుడిని తీయడానికి ఆలస్యమైంది. దీంతో బాలుడు మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికుడు కోరుతున్నారు.  ఇల్లు కూలి బాలుడు మృతిచెందడంతో గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో నాలుగు రోజులు వర్షాలు కురుస్తున్నాయి.  కడప జిల్లాలోని పలు భాగాలు, అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలతో పాటుగా సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఇవాళ కూడా వర్షాలు పడుతున్నాయి.  వర్షానికి కూలిపోయి పరిస్థితుల్లో ఉంటే ఇళ్లలో ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. 


పుట్టిన రోజు నాడే వెంటాడిన మృత్యువు


పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుదామని ఆ కుటుంబం అనుకుంది. పాఠశాలలో తోటి విద్యార్ధులకు చాక్లెట్లు పంచి తన ఆనందాన్ని పంచుకుంది చిన్నారి. తాత రావడంతో తిరిగి ఇంటి దగ్గర జరిగే వేడుకలకు బైకుపై పయనమైంది. మార్గం మధ్యలో చెట్టుకొమ్మ రూపంలో మృత్యువు చిన్నారి ప్రాణాలు తీసుకుంది. పుట్టిన రోజే చిన్నారిపై చెట్టు కొమ్మ పడటంతో మృత్యువాత పడిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. సత్తుపల్లి పట్టణానికి చెందిన కాళ్లకూరి అశోక్, జ్యోత్స దంపతులకు కుమార్తె 11 ఏళ్ల లిఖిత సంతోషిని ఉంది. అశోక్‌ ఆరేళ్ల కిందటఅశోక్‌ మృత్యువాత పడటంతో జ్యోత్స్న తన కుమార్తెను సత్తుపల్లిలోనే తల్లిదండ్రుల వద్ద ఉంచి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంది. శుక్రవారం లిఖిత సంతోషిని బర్త్‌డే కావడంతో ఇంట్లో వేడుకలు చేసుకునేందుకు సిద్దమయ్యారు. తాత పూర్ణచందర్‌రావు ద్విచక్రవాహనంపై పిన్ని కూతురు దేవికాసాయితో కలిసి గంగారంలోని తాను చదివే పాఠశాలకు వెళ్లి తన స్నేహితులకు చాక్లెట్లు పంచింది.


విరిగి పడిన చెట్టుకొమ్మ అంతులేని విషాదం 


అనంతరం తిరిగి ఇంటి దగ్గర తన పుట్టిన రోజు వేడుకలు జరిపేందుకు ద్విచక్ర వాహనంపై పయనమయ్యారు. వీరు ముగ్గురు కలిసి వస్తుండగా తాళ్లమడ దగ్గర రహదారిపై ఉన్న చెట్టుకొమ్మ విరిగి ద్విచక్రవాహనంపై పడింది. ఈ సంఘటనలో లిఖితకు తీవ్ర గాయాలు కావడంతో ఇది గమనించిన స్థానికులు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గం మద్యలో మృత్యువాతపడింది. పుట్టిన రోజు నాడే చిన్నారిని చెట్టుకొమ్మ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. పుట్టిన రోజు వేడుకను అంతా సంబంరంగా జరుపుకుందామని బావించిన వారికి చిన్నారి మృతి చెందడం ఈ ప్రాంతంలో విషాదకరంగా మారింది.


Also Read : Pakistan Horror: హాస్పిటల్‌పై గుట్టలుగుట్టలుగా కుళ్లిన శవాలు, షాక్ అవుతున్న స్థానికులు