Village Festival In AP: ఏపీవ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ (సోమవారం) నుంచి పల్లె పండుగ (Village Festival) వారోత్సవాలు నిర్వహించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లెపండుగ వారోత్సవాలు ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. సోమవారం ఉదయం సీసీ రోడ్లతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 


కాగా, పల్లె పండుగలో భాగంగా రూ.4,500 కోట్లతో దాదాపు 30 వేల పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. మొత్తం 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనుల్ని సర్కారు చేపట్టనుంది. కాగా, ఇటీవలే పల్లె పండుగ కార్యక్రమంపై పవన్ కల్యాణ్.. అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, జిల్లా పరిషత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు 23న ఏపీ వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ ద్వారా ప్రారంభించాలన్నారు.


Also Read: Konaseema News: కబ్జా కోరల్లో ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్‌- రోడ్లున పడ్డ ప్రయాణికులు- చోద్యం చూస్తున్న అధికారులు!