Andhra Pradesh Politics: వైసీపీ (YSRCP)కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జగన్ (Jagan)కు బై బై చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో(Assembly Elections) తమకు టికెట్ దక్కదని నిర్దారణకు వచ్చిన నేతలు వైసీపీని వీడేందుకే మొగ్గు చూపుతున్నారు. తమకు ఏ పార్టీ టికెట్ ఇస్తామంటే ఆ పార్టీ వైపే ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీల నేతలకు టచ్ లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జగన్ కు ఝలక్ ఇస్తున్నారు. మొన్న పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, నేడు తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి.
టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి
తిరువూరు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన రక్షణనిధికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పేసినట్లు తెలుస్తోంది. తిరువూరు నుంచి రెండు సార్లు గెలుపొందిన తనకు టికెట్ నిరాకరించడంపై ఎమ్మెల్యే రక్షణనిధి ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. తన స్థానంలో మరొకరికి సీటు ఇస్తానని చెప్పడంతో...రక్షణనిధి పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన, కాంగ్రెస్ నేతలకు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమని...పక్క పార్టీ నేతలకు సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి రక్షణనిధికి దారుమూసుకుపోయాయని, అందుకే ఆయన పక్క పార్టీ నేతలకు టచ్ లోకి వెళ్లారని జోరుగా చర్చ నడుస్తోంది. పార్టీలోనే ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూతలను..రక్షణనిధి వద్దకు రాయబారం పంపారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ చర్చలు జరిపినప్పటికీ...రక్షణనిధి మాత్రం పార్టీలో కొనసాగేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. పార్టీలో కొనసాగాలంటే తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందేనని, లేదంటే మరోపార్టీ చూసుకుంటానంటూ తెగేసి చెప్పినట్లు సమాచారం.
మూడో జాబితా వస్తే...మరింత మంది బై బై
వైసీపీ మూడో జబితా విడుదల చేసిన తర్వాత మరింత మంది నేతలు రాం రాం చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వేల పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తున్నారు. వ్యతిరేకత ఉందని, గెలిచే అభ్యర్థులకే టికెటు ఇస్తున్నామని చెబుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు...వైసీపీ గుడ్ బై చెప్పేస్తున్నారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఇప్పటికే జగన్ కు దూరమయ్యారు. నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో చేరితే...ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ యాదవ్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అదే దారిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా ఉన్నారు. కొందరు ఇప్పటికే పక్క పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి...కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డిని కలిశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో...హస్తం పార్టీకి ఊపు వచ్చింది. పాతకాపులంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
Also Read: కేశినేని నానికి చిన్ని స్ట్రాంగ్ కౌంటర్- కుటుంబ కలహాలపై క్లారిటీ
Also Read: ముద్రగడ మద్దతు కోసం టీడీపీ, జనసేన, వైసీపీ ప్రయత్నాలు- ఆయన ఇంటికి నేతల క్యూ