YSRCP MP MLAs one month salary for Vijayawada flood victims | అమరావతి: ఏపీలో వరద బాధితుల కోసం విరాళాల వెల్లువ కొనసాగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార,  ఇతర రంగాల ప్రముఖులు పెద్ద మనసుతో విజయవాడ వరద బాధితుల కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చారు. ఈ కష్టకాలంలో తమకు తోచినంత సాయం ప్రకటించారు. తాజాగా విజయవాడ వరద బాధితుల కోసం వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతుగా వైసీపీ రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ చేపట్టనున్న వరద బాధిత సహాయ కార్యక్రమాలకు పార్టీ ప్రజాప్రతినిధుల నెల వేతనాన్ని విరాళాన్ని వినియోగించనున్నారు. 


ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో వరద పరిస్థితిని ఇటీవల నేరుగా పరిశీలించారు. అనంతరం విజయవాడ వరద బాధితులకు సహాయార్థం వైసీపీ తరఫున పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇదివరకే కోటి రూపాయల సహాయాన్ని ప్రకటించడం తెలిసిందే. ఆ కోటి రూపాయల మొత్తాన్ని వరద బాధితులకు పాల ప్యాకెట్లు, వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేశారు. ఇంకా వరద బాధితుల అవసరాలు గుర్తించి, సరుకులు పంపిణీ చేస్తామని వైసీపీ ఇదివరకే ప్రకటించింది. దాంతో పాటు తాజాగా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల వేతనం ఇవ్వనున్నారు. జగన్ రెండోసారి సైతం విజయవాడలో వరద బాధితులను పలకరించారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ తరఫున తోచిన సాయం చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.


వరద బాధితులకు సాయం చేసిన సెలబ్రిటీలు.. 
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యధికంగా రూ.6 కోట్లు సాయం ప్రకటించారు. హీరో ప్రభాస్ రూ.2 కోట్లు సాయం ప్రకటించి మనసున్న రాజుగా మరోసారి నిరూపించుకున్నారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రూ.1 కోటి ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి సైతం వరద బాధితులకు కోటి రూపాయలు సాయం ప్రకటించి అండగా నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ చీఫ్ నారా భువనేశ్వరి రూ.2 కోట్లు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. ఏపీ, తెలంగాణకు దగ్గుబాటి ఫ్యామిలీ విరాళం కోటి ఇస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. కొన్ని సంస్థలు వేలాది మందికి ఆహారం, పాలు, నీళ్లు అందించాయి.


Also Read: ఏపీలో వరదలపై ఒక్క రూపాయీ ఇవ్వలేదు - కేంద్రం సాయంపై చంద్రబాబు స్పష్టత