Indian Army Started Work At Budameru: బుడమేరు పోటెత్తడంతో విజయవాడలో (Vijayawada) వరద విలయం సృష్టించింది. వాగుకు గండ్లు పడడంతో పలు ప్రాంతాల, కాలనీలను నీరు ముంచేసింది. ఈ క్రమంలో గండ్లు పూడ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. గత 24 గంటలుగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బుడమేరు వద్ద పనులను దగ్గరుండీ మరీ పర్యవేక్షిస్తున్నారు. ముంపు నుంచి విజయవాడ నగరం తేరుకునే వరకూ తాను తిరిగి వెళ్లేది లేదంటూ అక్కడే కాల్వగట్లపైనే గడిపారు. గండ్లు పూడ్చేందుకు భారత సైన్యం సైతం రంగంలోకి దిగింది. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చివేయగా.. మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు వద్ద గండిని పూడ్చివేత పనులను ఆర్మీ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ వింగ్, రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఆర్మీ కీలక ప్రకటన
బుడమేరు (Budameru) గండ్ల వద్ద సమస్య పరిష్కరించేందుకు పలు చర్యలు చేపట్టినట్లు ఆర్మీ సిబ్బంది తెలిపారు. గండ్లను గేబియాన్ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపే ప్రక్రియ) ద్వారా పూడ్చాలని నిర్ణయించినట్లు సైన్యం వెల్లడించింది. 'బుడమేరుకు గండ్లు పడిన చోట 10 నుంచి 15 మీటర్ల వెడల్పు ఉన్నట్లు గుర్తించాం. మూడో గండి 80 నుంచి 100 మీటర్ల ఉంది. వీటిని గేబియాన్ బుట్టలతో పూడుస్తాం. తొలుత గేబియాన్ బుట్టలు పేర్చి తర్వాత రాళ్లు వేస్తాం. బుట్టలను పటిష్టంగా ఉంచేలా 4 మీటర్ల వరకూ రక్షిత కట్ట నిర్మిస్తాం. స్థానికంగా గేబియాన్ బుట్టలను తయారుచేస్తున్నారు. ఇసుక సంచులతో నింపి హెస్కో బుట్టలు వాడుతాం. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ హెచ్ఏడీఆర్ బృందం పనిచేస్తోంది.' అని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
కాగా, భారీ వర్షాలకు వరద పోటెత్తగా బుడమేరు మళ్లింపు కాలువకు 3 రోజుల క్రితం గండ్లు పడ్డాయి. ఎడమగట్టు 3 చోట్ల తెగిపోగా.. కుడిగట్టుకు ఏడుచోట్ల గండ్లు పడ్డాయి. ఈ నీరంతా విజయవాడ నగరంతో పాటు దిగువనున్న గ్రామాలు, పంట పొలాల్లోకి పోటెత్తుతోంది. గండ్లను పూడ్చితే వరద ప్రవాహం పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ఈ క్రమంలో మంత్రి నిమ్మల బుధవారం నుంచే వరద నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గురువారం రాత్రి వరకూ ఈలప్రోలు, కవులూరు వద్ద గండ్లకు మరమ్మతులు పూర్తయ్యాయి. అనంతరం రాయనగర్ నుంచి సింగ్ నగర్ వైపు వరద పోటెత్తగా ఆ ప్రాంతంలో గండ్ల పూడ్చివేతకు చర్యలు చేపట్టారు.
సీఎం ఏరియల్ సర్వే
మరోవైపు, సీఎం చంద్రబాబు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేశారు. బుడమేరు (Budameru) డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరద ప్రవాహం, ముంపు, గండ్లు పడిన ప్రాంతాలను సర్వే చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అటు, కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు తక్షణ సాయం కింద రూ.3,300 కోట్లు విడుదల చేసింది.