Hyderabad International Airport: విదేశాలకు వెళ్లాలని అనుకున్న వైసీపీ లీడర్ దేవినేని అవినాష్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో నిలువరించారు. దీనిపై ఒక్కసారిగా రకరకాల వాదనలు కొనసాగుతున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఆయన పేరు ఉంది.
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో కీలక వ్యక్తిగా ఉన్న దేవినేని అవినాష్ గురువారం రాత్రి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన ఏ ఉద్దేశంతో వెళ్లాలనుకున్నారో తెలియడం లేదు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగాని ఈ సమాచారాన్ని శంషాబాద్ సెక్యూరిటీ సిబ్బంది మంగళగిరి పోలీసులకు అందించారు.
మంగళగిరి పోలీసుల అభ్యంతరం
విషయాన్ని తెలుసుకున్న మంగళగిరి పోలీసులు అవినాష్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆయన ప్రయాణానికి పర్మిషన్ లేదని అనుమతి ఇవ్వొద్దని శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో ఫారెన్ ఫ్లైట్ ఎక్కేందుకు అవినాష్‌కు రెడ్ సిగ్నల్ పడింది. అధికారులు అనుమతివ్వకపోవడంతో ఆయన వెనక్కి వచ్చేశారు.
పారిపోయే ప్రయత్నమన్న టీడీపీ సానుభూతిపరులు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌ను విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన కోర్టులకు వెళ్లి దీనిపై స్టే తెచ్చుకున్నారు. దీంతో ఆయన విదేశాలకు పారిపోతారనే అనుమానంతో లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ లుక్ అవుట్ అదేశాలు ఉండటంతో ఆయన్ని ఎయిర్‌పోర్టులో అధికారులు పట్టుకున్నారు. సమాచారన్ని లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిన పోలీసులకు అందజేశారు. దీనిపై టీడీపీ సోషల్ మీడియా చాలా సీరియస్‌గా రియాక్ట్ అవుతోంది. దేవినేని అవినాష్ విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్ చేశారని ట్రోల్ చేస్తోంది. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తి ప్లాన్ భగ్నం చేశారని అంటున్నారు.
కోర్టు ఉత్తర్వులతో ఆగిన విచారణ
టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘు, అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ పేర్లు ఎఫ్‌ఐర్‌లో ఉన్నాయి. దీనిపై కోర్టుకు వెళ్లిన వీళ్లంతా ఊరట పొందారు. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పింది. దీంతో వారిని విచారణకు పిలవకుండా కోర్టు ఆదేశాల కోసం పోలీసులు చూస్తున్నారు.
Also Read: దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు- కీలక నిర్ణయం తీసుకోనున్న వైసీపీ
2021 అక్టోబర్ 19న గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్రం కార్యాలయంపై దాడి జరిగింది. వైసీపీ నేతల ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరిగాయని అప్పట్లో టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసినా నాటి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడిని సీరియస్‌గా తీసుకుంది. విచారణలో వేగం పెరిగింది. నాటి ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. మరోవైపు మంగళగిరి పోలీసులు కూడా విచారణ స్పీడప్ చేశారు. రెండు వైపుల విచారణ వైసీపీ నేతలను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే దాడితో ప్రత్యక్ష సంబంధం ఉన్న వారిని అరెస్టు చేశారు. వారికి ఈ మధ్య బెయిల్ కూడా వచ్చింది. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘు, అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉండటంతో కోర్టును ఆశ్రయించి ఊరట పొందారు.
Also Read: ఆర్కే రోజా, ధర్మానకు బిగుస్తున్న ఉచ్చు! విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు