వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అధికార వైఎస్‌ఆర్‌సీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నిర్ణయాలు తీసుకోవటం మాత్రమే కాదు, వాటిని అమలు చేసేంత వరకు కూడా పక్క వాడికి తెలియకుండా వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థతో సంచలనం రేపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గృహసారథుల నియామకంలో కూడా అదే పంథా కొనసాగిస్తోంది. ఈ విషయం ఆఖరి నిమిషం వరకు ఎవరికి తెలియకుండా పని కానిచ్చేస్తోంది.  


ప్రభుత్వపరంగా నియమించిన వాలంటీర్‌ను కేంద్రంగా చేసుకొనే గృహ సారథులను కూడా నియమిస్తున్నారు. వాలంటీర్‌గా ఒక ఇంటిలో భార్య పని చేస్తున్నట్లైతే, అదే ఇంటిలో ఆమె భర్తను గృహ సారథిగా బాధ్యతలు అప్పగిస్తారట. ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు హై కమాండ్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా చాలా చోట్ల ఇప్పటికే ఎంపిక కూడా నిర్వహించారు. ఇంటిలో వాలంటీర్ ఉంటే అదే ఇంటిలో వాలంటీర్‌ అన్న, తమ్ముడు, బాబాయ్, అక్క, చెల్లి ఇలాంటి వరుసలతో ఉన్న వ్యక్తులను గృహ సారథిగా బాధ్యతలు అప్పగిస్తారు. సో అటు పార్టీ, వ్యవహరాలు, ఇటు ప్రభుత్వ వ్యవహరాలు కూడా కలసి పని చేసుకునే వీలుంటుంది. దీని వలన అంతిమంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ మరింతగా బలపడి, ఓటర్‌ను ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా చెబుతున్నారు.


దెబ్బకు రెండు ఓట్లు...


వాలంటీర్ వ్యవస్థ, గృహ సారథి వ్యవస్థల ద్వార ఇంటికి రెండు ఓట్లు కచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖతాలోకి వెళతాయని ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. గృహ సారథి వ్యవస్థ మరింత బలంగా పని చేస్తే, వాలంటీర్ వ్యవస్థ కూడా అనుబంధంగా ఉంటుంది. కాబట్టి ఇంటిలోనే కనీసం నాలుగు ఓట్లు దక్కించుకునే ఛాన్స్ లేకపోలేదన్నది కూడా పార్టీ నేతల అభిప్రాయం. దీంతో ఈ పరిణామాలపై పార్టీ పెద్దలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. ఇది పూర్తిగా సక్సెస్ అయితే జగన్ పెట్టిన టార్గెట్ వై నాట్ 175ని రీచ్ కావటం పెద్ద కష్టం కాదన్న అంచనాల్లో పార్టీ నేతలు ఉన్నారు.


గృహ సారథిలో ఇది కూడా వ్యూహమే 


వాస్తవానికి పార్టీపరంగా గృహ సారథుల నియామకంపై ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న కారణంగానే చాలా చోట్ల గృహ సారథిగా పని చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదన్న ప్రచారం ఉంది. ఈ ప్రచారాన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలు చాలా లైట్ తీసుకుంటున్నారు. రావటం లేదన్నది ప్రచారమైతే, నియామకాల్లో షరతులను పాటించాలనే ఉద్దేశంతో వ్యూహంతో అడుగులు వేస్తున్నామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. గృహ సారథుల నియామకాల్లో మొదటి టార్గెట్ వాలంటీర్, వాలంటీర్ కు పూర్తిగా అనుకూలమైన వ్యక్తి కావాలి. అంటే ఒక మహిళ వాలంటీర్‌గా ఉంటే ఆమె భర్తకు గృహ సారథిగా నియామకం అయ్యేందుకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు. అది కాని పక్షంలో తండ్రి, ఇతర కుటుంబ సభ్యులను ఎంచుకుంటారు. అది కూడా కుదరకపోతేనే మరో దగ్గరి బంధువును ఎంపిక చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. దీని వలన ఎంపిక కొంత ఆలస్యం అవుతుందేమో కానీ, ఎన్నికల నాటికి ఈ వ్యవస్థ పకడ్బందీగా తీర్చిదిద్దితే అనుకూల ఫలితాలు వస్తాయన్నది అధికార పక్షం ధీమా.