పరిపాలన ఎలా ఉండాలో మూడున్నర ఏళ్లలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలతో ఒక మోడల్ గా నిలిచారని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రతిపక్షం‌ మాయల‌మరాఠిగా మీడియా మొత్తాన్ని‌ గుప్పిట్లో పెట్టుకుని అబద్దాలని‌ ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మీ సామాజిక వర్గంలో గతంలో పరిస్ధితులు... ఇపుడు ఈ ప్రభుత్వంలో ఉన్న పరిస్ధితులని ప్రజలు చూస్తున్నారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని 2019 వరకు అధికారంలో ఉన్నవ్యక్తి అనలేదా అని ప్రశ్నించారు. 


ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడారు. మా పార్టీ డిఎన్ఎ లోనే ఎస్సి, ఎస్టి, బిసిలు ఉన్నారు. విద్య, వైద్యం ద్వారా ఎస్సీ, ఎస్టీలకి మేలుజరిగేలా వైఎస్సార్ హయాంలో అడుగులు మొదలయ్యాయి. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్యాన్ని బలహీనవర్గాలకి మరింత చేరువ చేశారన్నారు. పేదవాడు పేదవాడిగానే ఉండాలనేది గత పాలకుల ఆలోచన కాగా,  బహుజనుల‌ పేరు చెప్పుకునే వచ్చిన‌పార్టీలు సైతం అదే దారిలో వెళ్లాయన్నారు. నేటికీ పార్లమెంట్ లో మహిళా బిల్లుని రానివ్వరు, కానీ సిఎం వైఎస్ జగన్ ఎస్సి,ఎస్టి, బిసిలకి‌ 50 శాతం రిజ్వేషన్లు అమలు చేశారు. అందులోనూ 50 శాతం‌ మహిళలకి రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు.
సామాజికవేత్తగా సిఎం వైఎస్ జగన్
సిఎం వైఎస్ జగన్ తన‌ నిర్ణయంతో బెంచ్ మార్కు గా మార్చారు. ఇంతకంటే ఎవరూ తక్కువ రిజర్వేషన్లు ఇవ్వలేరు. ఎక్కువ మందికి న్యాయం జరుగుతుందని భావిస్తే సంతకం చేయడానికి సిఎం జగన్ వెనుకాడరు. సామాజికవేత్తగా సిఎం వైఎస్ జగన్ ఆలోచిస్తూ ఆచరణలో చూపుతున్నారు. ఆర్ధిక ఇబ్బంధులు ఉన్నా సంక్షేమ‌పధకాలు ఎక్కడా ఆగలేదు. ఈ ప్రభుత్వంలో అవకాశాలు చాలినంత ఉన్నాయని.. మీరు అందుకోవడమే ఆలస్యం అన్నారు. 


పులివెందుల‌ బిడ్డకు తెలుగుపై మమకారం 
సిఎం వైఎస్ జగన్ కి తెలుగుపై మమకారం ఉంది. పులివెందుల‌ బిడ్డ... అచ్చ తెలుగులో మాట్లాడగలరు. ఇంగ్లీష్ పై మోజుతో‌ తెలుగుపై కోపంతో ఇంగ్లీష్ మీడియం‌ పెట్టలేదు. ప్రస్తుతం ఇంగ్లీష్ చదువులు అవసరం అయి పెట్టారు. అంతర్జాతీయ స్ధాయిలో విద్యార్ధులు రాణించాలని ఇంగ్లీష్ ని ప్రోత్సహించారు. టాప్ వంద యూనివర్సిటీలలో పేద విద్యార్ధులు సీటు తెచ్చుకుంటే ఎన్ని‌కోట్లైనా ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం విదేశీ విద్య పేరుతో అరకొరగానే నిధులు ఇచ్చింది. బలహీనవర్గాల కుటుంబాలలో‌ మార్పు తీసుకురావడానికే విద్యకి ఇంత పెద్దపీట వేస్తున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మేలుని‌ మీ వర్గాలకి తెలియజెప్పాలి.


వచ్చే ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని, అధికారమనేది సేవ.. ప్రజల జీవితాలలో మార్పు తీసుకొచ్చే బాధ్యత అని సిఎం వైఎస్ జగన్ విశ్వసిస్తున్నారని సజ్జల అన్నారు. సిఎం వైఎస్ జగన్ ని అధికారంలో‌ కొనసాగించడం బలహీనవర్గాలకి అవసరం అని అభిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ వెళ్లి చంద్రబాబు ఏం చేశారు. కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఒప్పందాన్ని అమలు చేయలేదు. సిఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు కొనసాగాలి. మరింత మెరుగైన ఫలితాలు రావాలి...అందుకే వైఎస్ జగన్ రావాలి. మభ్యపెడుతున్న ప్రతిపక్షాలని తిప్పికొట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 


‘ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నేను ఎపుడూ అందుబాటులో ఉంటాను. గతంలో ఉద్యోగుల యూనియన్లని రాజకీయ ప్రయోజనాలకి వాడుకునేవారు. ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగంగా సిఎం వైఎస్ జగన్ చూస్తున్నారు. ఉద్యోగులు లేకుండా ఏమీ చేయలేం. లక్ష్యాన్ని చేరువ కావడానికి చిత్తశుద్దితో పనిచేయాలి. మీ సమస్యలు ప్రభుత్వ సమస్యలు...పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. ఆర్ధిక ఇబ్బంధులు వల్ల కొన్ని సమస్యలున్నాయి. కానీ ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి సరైన మార్గంలోనే వెళ్తున్నాయి. ఒక్క రూపాయి వేస్ట్ చేయటం లేదని’ ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి వివరించారు.