CM Jagan News: జగన్ తో సెల్ఫీ దిగేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఆయన కూడా ఎక్కడా ఎవర్నీ డిజప్పాయింట్ చేయకుండా తన వద్దకు వచ్చేవారందరితో సెల్ఫీ దిగుతుంటారు. 2019 ఎన్నికల ముందు జగన్ ప్రచారంలో ఆ సందడి బాగా కనపడింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఓ మోస్తరు నాయకులకు ఆ అవకాశం ఎక్కువగా లభించేది. ఇప్పుడు మాజీ అయిన తర్వాత మళ్లీ సామాన్యులకు సెల్ఫీ అవకాశాలు బాగా వస్తున్నాయి. జగన్ పర్యటనలకు వచ్చినా, పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో ఉన్నా సెల్ఫీ సెషన్ మాత్రం కామన్ గా జరుగుతుంది. తాజాగా జగన్ గుంటూరు జిల్లా సబ్ జైలు వద్ద కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ, తన కుమార్తెతో కలసి జగన్ వద్దకు వచ్చి సెల్ఫీ దిగారు. ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా..? ఆమె డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ కావడమే ఇక్కడ విశేషం.
అనంతపురం జిల్లాకు చెందిన ఆయేషాబాను గుంటూరు జిల్లా సబ్ జైలులో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ని జగన్ పరామర్శించేందుకు వచ్చిన సమయంలో ఆయనను సెల్ఫీ అడిగారు. తనతోపాటు ఉన్న కుమార్తెను కూడా జగన్ కి పరిచయం చేశారు. వారిద్దరూ జగన్ తో సెల్ఫీ దిగారు. సెల్ఫీ అడిగితే జగన్ ఎవర్నీ నిరుత్సాహ పరచరు కాబట్టి ప్రెస్ మీట్ టైమ్ లో కూడా ఆయన వారిని వారించలేదు. ఆయేషాబాను పోలీస్ యూనిఫామ్ లో ఉండి కూడా జగన్ తో సెల్ఫీ దిగడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముఖ్యంగా టీడీపీ అనుకూల హ్యాండిళ్లు.. ఈ వ్యవహారాన్ని బాగా హైలైట్ చేశాయి. విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ జగన్ వద్దకు వెళ్లి సెల్ఫీ దిగడమేంటని టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఇలా ఒక పార్టీపై, ఆ పార్టీ అధినేతపై అభిమానం పెంచుకోవడమేంటని అడుగుతున్నారు. పోనీ పార్టీపై అభిమానం ఉంటే పర్లేదు, విధి నిర్వహణలో ఉండి కూడా రాజకీయ నాయకులతో సెల్ఫీలేంటి అని విమర్శిస్తున్నారు. ఆమెది అత్యుత్సాహం అంటూ కొంతమంది పోస్టింగ్ లు పెట్టారు. మరికొందరు ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ హోం మంత్రి వంగలపూడి అనితను సైతం ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పెట్టారు.
అటు వైసీపీ అభిమానులు మాత్రం ఆమెను కరడుగట్టిన జగన్ అభిమాని అని అభివర్ణిస్తున్నారు. ఆమె ధైర్యానికి సలాం అంటూ ట్వీట్లు వేస్తున్నారు.
Also Read: అచ్చెన్నాయుడు మాటంటే మాటే, రాష్ట్ర పండగగా కొత్తమ్మతల్లి జాతర - భారీగా నిధులు సైతం
జగన్ జైలు వద్దకు పరామర్శకోసం వస్తారని సిబ్బందికి సమాచారం ఉంది. అందుకే సదరు మహిళా కానిస్టేబుల్ తన కుమార్తెను సైతం జైలు వద్దకు పిలిపించారనే ప్రచారం జరుగుతోంది. ముందుగా అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జగన్ తో ఆమె సెల్ఫీ దిగారని, అది సోషల్ మీడియాలో హైలైట్ అ్యయేలా చేశారని కూడా అంటున్నారు. జగన్ కి జనంలో క్రేజ్ తగ్గలేదని నిరూపించేందుకే ఇలాంటి సీన్ క్రియేట్ చేశారని కొంతమంది సోషల్ మీడియాలో కౌంటర్లిస్తున్నారు. అయితే పోలీస్ డిపార్ట్ మెంట్ మాత్రం ఇప్పటి వరకూ ఈ సెల్ఫీపై స్పందించలేదు. ఒకవేళ స్పందించినా, ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా, కనీసం ఎక్స్ ప్లెనేషన్ అడిగినా కూడా విమర్శలను ఆహ్వానించినట్టే అవుతుంది. అందుకే డిపార్ట్ మెంట్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది.