Andhra Pradesh Floods: నీట మునిగిన విజయవాడ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఇళ్లకు చేరిన ప్రజలు ఇంటిని సర్దుకుంటున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసుకుంటున్నారు. ఓవైపు ప్రభుత్వం కూడా జరిగిన నష్టంపై లెక్కలు తీస్తోంది. ఓ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఫైనల్ రిపోర్ట్‌పై కసరత్తు చేస్తోంది. ఎంత చేసిన పూర్తి స్థాయి నష్టం పూడ్చడం ప్రభత్వం వల్ల అయ్యే పని మాత్రం కాదు. అందుకే వీలైనంతగా ప్రజలకు వెసులుబాటు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే చెడిపోయిన వాహనాల ఇన్సురెన్స్‌పై ఫోకస్ చేసింది. 


వరదల్లో చాలా వరకు టూవీలర్స్, ఇతర వెహికల్స్ డ్యామేజీ అయ్యాయి. కొన్ని కొట్టుకుపోయాయి. మరికొన్నింటిని ప్రజలు మరమ్మతులు చేయించుకుంటున్నారు. అయినా అవి పని చేస్తాయో లేదో కూడా తెలియదు. వీటినే నమ్ముకున్న ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అందుకేప్రభుత్వ బీమా కంపెనీలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపించింది. 


బీమా సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన ప్రభుత్వం వెహికల్ ఇన్సూరెన్స్‌ సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపించింది. అన్ని బీమా సంస్థలను ఒక చోట చేర్చింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌ పరిష్కారం కోసం విజయవాడలోని మాటిస్సోరి కాలేజీలో ప్రతినిధులు ఓ ఫెసిలిటీ సెంటర్ పెట్టారు. 


మూడు రోజులుగా వందల మంది ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు. బీమా డబ్బుల కోసం రిక్వస్ట్‌లు పెట్టుకుంటున్నారు. దాదాపు 27 బీమా కంపెనీలు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఒక్క వాహనదారులే కాకుండా వ్యాపారులు కూడా ఈ ఫెసిలిటీ సెంటర్‌కు వస్తున్నారు. బీమా సొమ్ము క్లెయిమ్ కు రిక్వస్ట్‌లు పెట్టుకుంటున్నారు. 


విజయవాడలో దాదాపు వారం పదిరోజులుగా వరద నీటిలో ఉండిపోయిన వాహనాలు ఉండిపోవడంతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు ప్రజలు. అందుకే పూర్తి స్థాయిలో క్లెయిమ్స్ వచ్చే చూడాలని కంపెనీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బీమా కంపెనీలు కూడా టూ వీలర్స్‌కు, ఇతర వాహనాలకు వేర్వేరుగా లెక్కకట్టి రిజిస్ట్రేషన్ చేసిన సంవత్సరం బట్టి బీమా ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి. ఈ డబ్బులు కూడా వన్‌టైం సెటిల్‌మెంట్‌గా వినియోగదారులకు ఇవ్వాలని చూస్తున్నారు. 


జరిగిన నష్టంతో పోల్చుకుంటే మాత్రం కంపెనీలు ఇచ్చింది చాలా తక్కువని వాపోతున్నారు ప్రజలు. ఉదారంగా ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు. అంతే కాకుండా మునిగిపోయిన వాహనాల ఫొటోలు అడుగుతున్నారని వాటిని ఎలా తీసుకొస్తామని ప్రశ్నిస్తున్నారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కావడం లేదని వాపోతున్నారు. అయితే పేపర్స్ లేవని ఇతర డాక్యుమెంట్స్ లేవనే బెంగ వద్దని నెంబర్ ఉంటే చాలు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.