Vijayawada Floods News: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. 11 రోజుల తర్వాత ఆయన సచివాలయానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల ప్రారంభం నుంచి విజయవాడలో వచ్చిన వరదల కారణంగా చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఉండే సమీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి పదే పదే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను దగ్గరుండి చూసుకున్నారు.
ముఖ్యంగా ఆగస్టు నెల చివరి నుంచి భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వరద కారణంగా విజయవాడలోని బుడమేరు వాగు పొంగి మరీ ప్రవహించింది. దీంతో విజయవాడలోని బుడమేరు నది ప్రవహించే ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీటమునిగాయి. చాలా ప్రాంతాల్లో గొంతు వరకూ వరద నీరు చేరుకుంది. దీంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారికి కనీసం తిండి, నీరు కూడా లేని స్థితిలో చంద్రబాబు దగ్గరుండి బాధితుల వద్దకు వెళ్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
మరోవైపు వరద రావడానికి కారణమైన బుడమేరు వాగుకు పడ్డ గండ్లను కూడా పూడ్చివేయించారు. సెప్టెంబరు 1న అర్ధరాత్రి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు.. వరదలు తగ్గి, పరిస్థితులు మొత్తం చక్కబడిన తర్వాతే ఇక్కడి నుంచి వెళతానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో గత 10 రోజులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఉంటూ తాజాగా 11 రోజుల తర్వాత సెక్రటేరియట్ కు వెళ్లారు.