విజయవాడలో కొద్ది రోజుల కిందట వైఎస్సార్‌సీపీ నేత, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో హల్ చల్ చేసిన విషయంలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పీఎస్‌కు రావడానికి బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఎంపీ అనుచరులపై ఇన్‌స్పెక్టర్ దురుసుగా ప్రవర్తించడంతో పాటు చెయ్యి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టిఫిన్ చేయడానికి బయటకు వచ్చామని ఓ యువకుడు పోలీసుకు చెప్పాడు. కానీ ఇన్‌స్పెక్టర్ ఇవేమీ పట్టించుకోకుండా కాలర్ పట్టుకుని అతడ్ని తిట్టాడు. అంతటితో ఆగకుండా, నువ్వు వాలంటీర్ అయితే ఏంట్రా, నీ జాబ్ తీయించేస్తా తెలుసా అంటూ యువకుడికి వార్నింగ్ ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. వాలంటీర్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు యువకుల్ని సైతం పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్ తన అనుచరులైన బాధితుల పక్షాన నిలిచారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు అర్ధరాత్రి సమయంలో వచ్చి పోలీసులకు వాగ్వివాదానికి దిగడానికి వారిపై పోలీసులు చెయ్యి చేసుకుని, తిట్టడమే కారణమని సమాచారం.
మొదట్లో బాధితులు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయగా వారి వద్ద సెల్ ఫోన్లు తీసుకుని అందులో రికార్డ్ చేసిన వీడియోలను పోలీసులు డిలీట్ చేశారట. విషయాన్ని బాధితులు ఎంపీకి ఫోన్ చేసి చెప్పగా.. కొంత మంది అనుచరులతో నందిగాం సురేష్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి బాధితుల తరఫున మాట్లాడి, వారిని విడిచిపెట్టాలని పోలీసులను కోరారు. వారు అక్కడ సైతం దురుసుగా ప్రవర్తించడంతో పాటు యువకులదే తప్పు అని ఎంపీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమను పోలీసులు కొట్టారని బాధితులు వారించినా, ప్రూఫ్ లేకపోవడంతో పీఎస్ నుంచి తన అనుచరులతో కలిసి ఎంపీ తిరిగి వెళ్లిపోయారు.
ఆరోజు ఏం జరిగిందంటే..
బైకుపై వెళ్తున్న యువకుల్ని పోలీసులు ఆపారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని ప్రశ్నిస్తూ వారిపై చెయి చేసుకుంటూ దురుసుగా ప్రవర్తించారు పోలీసులు. ఆపై యువకుల్ని పీఎస్‌కు తరలించారు. ఈ విషయాన్ని కొందరు ఎంపీకి ఫోన్ చేసి చెప్పారు. కొందరు అనుచరులతో కలిసి ఎంపీ నందిగాం సురేష్ కృష్ణలంక పీఎస్‌కు వచ్చారు. తన అనుచరులను పీఎస్‌కు ఎందుకు తీసుకొచ్చారు, వారిపై ఎందుకు చేయి చేసుకున్నారంటూ హంగామా చేశారు. పోలీసులతో వాగ్వివాదంతో పాటు దాడికి దిగారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఈ తతంగాన్ని వీడియ తీస్తుంటే అతడి వద్ద నుంచి ఫోన్ తీసేసుకున్నారు. ఫర్నిచర్ ధ్వసం చేసి పీఎస్ నుంచి వెళ్లిపోతుండగా.. తన ఫోన్ తిరిగివ్వాలని ఎంపీ అనుచరులను కానిస్టేబుల్ కోరగా, దాడి చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.
Also Read: Weather Updates: వేడెక్కుతున్న ఏపీ, తెలంగాణ ! అక్కడ మాత్రం చలి తీవ్రత తగ్గలేదు