విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్ హల్ చల్ చేశారు. బస్టాండ్ ఎదురుగా గంగోత్రి హోటల్ లో వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను కృష్ణలంక ఎస్ఐ ఆపారు. తాము ఎంపీ నందిగామ సురేష్ అనుచరులం అంటూ హంగామా చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీ పీఎస్‌కు వెళ్లి, తన అనుచరులతో కలిసి వాగ్వివాదానికి దిగారు. ఓ కానిస్టేబుల్‌పై దాడికి సైతం పాల్పడి బీభత్సం చేశారు.
పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీ నందిగాం సురేష్ తన అనుచరులతో అర్ధరాత్రి స్టేషన్ కు వచ్చి హల్ చల్ చేశారు. ఎస్ఐతో, సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా తన అనుచరులతో కలిసి పోలీసులతో బాహాబాహీకి దిగారు. పీఎస్‌లో ఎంపీ నందిగాం సురేష్, అతడి అనుచరులు చేస్తున్న తతంగాన్ని వీడియో తీస్తున్నాడన్న కారణంగా కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై దాడి చేశారు. కానిస్టేబుల్ నుంచి ఫోన్ లాక్కోవడంతో పాటు ఫర్నిచర్ ని నందిగం సురేష్ అనుచరులు ధ్వంసం చేశారు. స్టేషన్లో గొడవ పడిన తరువాత అనుచరులతో కలిసి ఎంపీ నందిగాం సురేష్ వెళ్లిపోతుండగా, గేటు దగ్గరికి వెళ్లి తన ఫోన్ తిరిగివ్వాలని కానిస్టేబుల్ వారిని అడిగారు. ఫోన్ అడిగినందుకు కానిస్టేబుల్‌పై ఎంపీ అనుచరులు దాడిచేసి కొట్టారు.
అసలేం జరిగిందంటే..
ఎంపీ నందిగాం సురేష్ మేనల్లుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి విజయవాడలోని ఓ మల్టిప్లెక్స్ లో సినిమాకు వెళ్లారు. షో పూర్తయ్యాక బైకుపై అతివేగంగా వెళ్తున్నారు. ఇది గమనించిన కృష్ణలంక పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిని బస్టాండ్ ఎదురుగా గంగోత్రి హోటల్ వద్ద ఆపారు. తాము ఎంపీ మనుషులం అంటూ యువకులు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు అడిగిన వాటికి బదులివ్వకుండా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. యువకులను బలవంతంగా ఎస్ఐ, సిబ్బంది పోలీస్ స్టేషన్‌కు తరలించగా, దీన్ని వీడియో తీసిన యువకులు నందిగాం సురేష్‌కు వీడియో పంపించారు.
కొందరు అనుచరులతో కలిసి ఎంపీ నందిగాం సురేష్ కృష్ణలంక పీఎస్‌కు వచ్చారు. తన అనుచరులను పీఎస్‌కు ఎందుకు తీసుకొచ్చారు, వారిపై ఎందుకు చేయి చేసుకున్నారంటూ హంగామా చేశారు. పోలీసులతో వాగ్వివాదంతో పాటు దాడికి దిగారు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఈ తతంగాన్ని వీడియ తీస్తుంటే అతడి వద్ద నుంచి ఫోన్ తీసేసుకున్నారు. ఫర్నిచర్ ధ్వసం చేసి పీఎస్ నుంచి వెళ్లిపోతుండగా.. తన ఫోన్ తిరిగివ్వాలని ఎంపీ అనుచరులను కానిస్టేబుల్ కోరగా, దాడి చేసి అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరగా గోప్యంగా ఉంచడానికి యత్నిస్తున్నారని, విషయం అందరికీ తెలియడంతో దీనిపై ఏం చేయాలా అని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Gowtham Sawang Transfer: ఏపీలో ఎంత పెద్ద అధికారి అయినా, తేడా వస్తే అంతే ! గతంలో ఏం జరిగిందంటే !
Also Read: Sawang Lokesh : డీజీపీ సవాంగ్ బదిలీకి నారా లోకేష్ కారణమా?