"సవాంగ్" అన్న అంటూ ఆప్యాయంగా పిలిచే సీఎం జగన్మోహన్ రెడ్డి ( CM Jagan Mohan Reddy ) కటువైన నిర్ణయం తీసుకున్నారు. డీజీపీ ( DGP ) పోస్ట్ నుంచి తప్పించారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇంత కటువైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి ? తెర వెనుక అసలేం జరిగింది ? అన్నది అధికార పార్టీలోనే కాదు సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. అయితే అధికార వర్గాల్లో నడుస్తున్నచర్చ ప్రకారం డీజీపీ గౌతం సవాంగ్ బదిలీకి కారణం నారా లోకేష్ అని తెలుస్తోంది. అవును నిజమే..బదిలీకి దారితీసిన పరిస్థితులు అక్కడి నుంచే మొదలయ్యాయి. సవాంగ్ బదిలీకి నారా లోకేష్‌కు ( Nara Lokesh ) సంబంధం ఏమిటి ? అసలు ఎక్కడ లింక్ కుదిరింది ? అసలేం జరుగుతోంది ?
లోకేష్ వల్లే డీజీపీగా సవాంగ్‌కు బదిలీ !
డీజీపీ గౌతం సవాంగ్ ( Goutam Sawang ) ముఖ్యమంత్రి మనసును మెప్పించిన అధికారి. సీఎం జగన్ గెలిచిన వెంటనే మొదటి చాయిస్‌గా సవాంగ్‌ను ఎంచుకున్నారు. జగన్ పదవీ బాధ్యతలు చేపట్టక ముందే సవాంగ్ యాక్షన్‌లోకి దిగిపోయారు. అప్పటి నుండి ఆయన పనితీరు విషయంలో ప్రభుత్వం ఎక్కడా అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరగలేదు. తెలుగుదేశం పార్టీ ( TDP ) నేతలపై దాడుల విషయంలో, వారిపై కేసుల విషయంలో.. సోషల్ మీడియా పోస్టుల అరెస్టుల విషయంలో విమర్శలు, కోర్టుల నుంచి నోటీసులు అందుకున్నా ప్రభుత్వం వరకూ ఆయన పనితీరుపై సంతృప్తికరంగానే ఉంది. అయితే పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకలాగే ఉండవని సవాంగ్ బదిలీలో నిర్ధారణ అయిపోయింది. ఎంత మెప్పించేలా విధులు నిర్వహించినా కొన్ని కొన్ని చోట్ల బెడిసికొట్టడం ఖాయమని తేలిపోయింది. సీఎం జగన్‌కు గౌతం సవాంగ్‌కు మధ్య గ్యాప్ పెరగడానికి కారణం నారా లోకేష్ ఇన్సిడెంట్ అని భావిస్తున్నారు.
ప్రభుత్వం ఆదేశించకపోయినా సవాంగ్ అత్యుత్సాహం ప్రదర్శించారా ?
నారా లోకేష్ కరోనా ధర్డ్ వేవ్‌కు ముందు చురుగ్గా ప్రజల్లోకి వెళ్లారు. గుంటూరు నగరంలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. పరామర్శలకు వెళ్లినా అడ్డుకోవడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి. పోలీసులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా లోకేష్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా లోకేష్ ఎక్కడికెక్కినా అడ్డుకోవడం ... భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించడం వంటివి చేశారు . ఇదంతా లోకేష్ ఇమేజ్ పెరగడానికి కారణం అయిందన్న అభిప్రాయం అధికార పార్టీలో ఏర్పడిందని అంటున్నారు. అప్పట్నుంచి సవాంగ్ పనితీరుపై సీఎం జగన్ ఏ మాత్రం సంతృప్తికరంగా లేరని చెబుతున్నారు. అదొక్కటే కాదు.. ఎస్పీల బదిలీల విషయంలో కూడా ప్రభుత్వానికి డీజీపీకి మధ్య కొంత గ్యాప్ పెరిగింది.
ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరాటం కూడా కారణమా ?
అదే సమయంలో పోలీసు ఉన్నతాధికారుల మధ్య ఉన్న ఆధిపత్య పోరాటం కూడా జగన్‌కు.. సవాంగ్‌కు మధ్య దూరం పెరగడానికి కారణం అయిందని తెలుస్తోంది. గత ఏడాది ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందిన కీలక బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఆదేశాలను డీజీపీ సవాంగ్ హోల్డ్‌లో పెట్టారని ప్రచారం జరిగింది. ఏమైనా ఆదేశాలు ఇవ్వాలంటే తాను ఇవ్వాలని ఆయన ఇవ్వడానికి ఎవరని డీజీపీ వాటిని హోల్డ్‌లో పెట్టడం ప్రభుత్వ పెద్దల్ని ఆగ్రహానికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి కూడా సీఎం జగన్ కు డీజీపీతో పెద్దగా మాటల్లేవని చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు నాడు, కొత్త సంవత్సరం రోజున కూడా ఉన్నతాధికారులంతా కలుస్తారు. కానీ ఈ సందర్భాల్లో కూడా డీజీపీ సీఎంను కలవలేకపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత తప్పని సరిగా కలవాల్సిన అధికారిక కార్యక్రమాల్లో తప్ప.. డీజీపీ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలవలేదు. సంక్రాంతి తర్వాత ఓ సారి మాత్రం కలిస్తే.. ముక్తసరిగా మాట్లాడారని అధికార వర్గాలు చెబుతున్నాయి ప్రభుత్వంపై ఆందోళనలు పెరుగుతూండటం వాటిని కట్టడి చేసే విషయంలో పోలీసులు వైఫల్యం చెందడం కూడా సీఎం జగన్ అసంతృప్తికి కారణమైందని భావిస్తున్నారు.
లోకేష్ విషయంలో ప్రారంభమైన గ్యాప్ బదిలీ దాకా వచ్చిందా ?
మొత్తంగా లోకేష్‌ను అడ్డుకోవాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా అత్యుత్సాహంతో లోకేష్ ఇమేజ్ పెరిగేలా చర్యలు తీసుకోవడం దగ్గర ప్రారంభమైన గ్యాప్ చివరికి బదిలీ వేటు పడేదాకా వచ్చిందని అంటున్నారు. సీఎం జగన్ పదవి చేపట్టాక ఇష్టంగా తెచ్చుకున్న చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ సవాంగ్ ఇద్దరూ పూర్తి కాలం పదవిలో ఉండలేకపోయారు. రిటైర్మెంట్ కాక ముందే అత్యున్నత పదవుల నుంచి వైదొలిగారు.