Flood again For Budameru| అమరావతి: ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. అయితే విజయవాడ నీట మునగడానికి బుడమేరు వాగుకు గండ్లు పడటం కారణమని తెలిసిందే. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్న తరుణంలో మరోసారి విజయవాడకు బుడమేరు ముప్పు పొంచి ఉందని ప్రచారం జరుగుతోంది. విజయవాడలో పలు కాలనీల్లోకి మళ్లీ బడమేరు వరద వస్తోందని, జక్కంపూడి కాలనీ, కొత్త రాజరాజేశ్వరీపేట సహా పలు కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో అలర్టులు కనిపిస్తున్నాయి.


బుడమేరు మళ్లీ పొంగిందనే ప్రచారంపై ఏపీ మంత్రి నారాయణ స్పందించారు. బుడమేరుకు మళ్లీ వరద వచ్చిందనే ప్రచారంలో నిజం లేదన్నారు. అవన్నీ వదంతులేనని, అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని విజయవాడ ప్రజలకు సూచించారు. బుడమేరు వాగు కట్ట మళ్లీ తెగింది అనేది దుష్ప్రచారం అని స్పష్టం చేశారు. విజయవాడ నగరం వరదల నుంచి తేరుకుందని, బుడమేరు గండ్లను సైతం ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేసిందన్నారు. కనుక సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. 


బుడమేరు కట్ట తెగిందంటూ ఆకతాయిల పుకార్లతో మంత్రి నారాయణ హుటాహుటీన రంగంలోకి దిగారు. కలెక్టర్ సృజనతో కలిసి కండ్రిక ఉడా కాలనీలో పరిస్థితిని సమీక్షించారు. కేవలం కొంతమంది ఆకతాయిల పుకార్లు సృష్టించారని మంత్రి నారాయణ, కలెక్టర్ సృజన్ నిర్ధారణకు వచ్చారు. ప్రజలెవరూ ఆందోళన  చెందవద్దని ప్రజలకు సూచించారు. 





బుడమేరు కట్ట తెగిందని వస్తున్న వదంతులు నమ్మవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన చెప్పారు. బుడమేరుకు ప్రస్తుతం ఏ ముప్పులేదని, ఉద్దేశపూర్వకంగా జరిగే ప్రచారాన్ని నమ్మి ఆందోళనకు గురికావొద్దని సూచించారు. ప్రజలను భయాందోళనకు గురిచేసే ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.