Rain Fall in Vijayawada: భారీ వర్షాలు విజయవాడ వాసులను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఏడాది వర్షాలకు బెజవాడలోని ఎన్నో కాలనీలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఒక రోజు వ్యవధిలో విజయవాడలో ఏకంగా 29 సెంటీమీటర్ల వర్షం పడినట్లుగా వాతావరణ అధికారులు చెబుతున్నారు. దీంతో 30 ఏళ్ల కిందటి రికార్డు బద్ధలైనట్లుగా చెబుతున్నారు. 25 ఏళ్ల క్రితం 1999లో ఈ స్థాయిలో వరద నీరు విజయవాడను ముంచెత్తిందని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో కృష్ణానది వెంట కరకట్టలు తెగిపోయే ప్రమాదకరమైన పరిస్థితులు నెలకున్నాయని అంటున్నారు.
ప్రస్తుతం విజయవాడలో లోతట్టులో ఉన్న అనేక కాలనీల్లో 4 అడుగుల మేర నీరు నిలిచింది. ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉంది. ఫలితంగా వాహనాల రాకపోకలకు బాగా అంతరాయం ఏర్పడింది. విజయవాడలో బుడమేరు కట్ట, అంబాపురం పైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగటంతో విజయవాడలోని సుందరయ్య నగర్, రాజీవ్ నగర్ ప్రకాష్ నగర్ పైపుల రోడ్డు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. విజయవాడ పాయకపురం కండ్రిక వరద ముంపులో ప్రజలు అల్లాడుతున్నారు.
మంగళగిరిలో
భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని లోకేష్ పరిశీలించారు. ముంపునకి గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడేందుకు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అందుతున్న సాయం, ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లల్లోకి నీరు ఉదృతంగా ప్రవర్తిస్తుందని.. నున్నకు చెందిన ఫైర్ సిబ్బంది, సహాయక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని లోకేశ్ తెలిపారు.
మంగళగిరి టౌన్ కొత్తపేటలో కొండచరియలు విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని లోకేష్ పరిశీలించారు. కొత్తపేటలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల పరిహారం అందించారు.
కొండచరియలు విరిగిపడి ఆరుగురు మరణం
ఇప్పటికే విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌లో కొండ చరియలు విరిగిపడి ప్రొటోకాల్ ఆఫీస్, డోనర్ సెల్ నాశనం అయిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షానికి పలు చోట్ల కొండచరియలు విరిగి కింద పడ్డాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఘాట్‌రోడ్‌ను మూసేశారు. శనివారం మధ్యాహ్నం బండరాళ్లు పడి ప్రొటోకాల్ ఆఫీస్ పూర్తిగా నేలమట్టం కాగా.. హైదరాబాద్ - విజయవాడ రోడ్డులో రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది. ఏకధాటి వర్షాలకు మొగల్రాజుపురంలో కొండచరియలు ఇళ్లపై విరిగి పడి.. ఆరుగురు మృతి చెందారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీ ప్రభుత్వం సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సీసీఎల్‌ఏ విజయలక్ష్మి ఆధ్వర్యంలో 19 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి... ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్‌కు ఐఎఎస్ అధికారి కోన శశిధర్‌ను అపాయింట్ చేశారు. 14,700కు పైగా ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను అధికారులు చూస్తున్నారు.
పురందేశ్వరి పరిశీలన
రికార్డ్ స్థాయిలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పరవళ్ళు తొక్కుతున్న కృష్ణా నది... ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నదిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు.