AP Rains : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటన రద్దయింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


సీఎం నిరంతర సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఉదయం నుంచి నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరో సారి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సిఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డివోలు, డిఎస్పీలతో మాట్లాడి తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయినట్లు అధికారులు వివరించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.  రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారం నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలని సీఎం ఆదేశించారు. శ్రీకాకుళం నుంచి విశాఖ మధ్య నేటి రాత్రి తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. మూడు జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తతో ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.


మెలకువగా ఉండైనా రక్షిద్దాం
 రాత్రి అంతా మెలుకువతో ఉండి అయినా సరే ప్రజల రక్షణ కోసం పని చేద్దామని సీఎం చంద్రబాబు అధికారులతో చెప్పారు.  తుఫాను తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. తీరం దాటే సమయంలో గాలుల వేగంపై స్పష్టమైన అంచనాలతో సన్నద్ధంగా ఉండాలన్న సీఎం.. ఇప్పుడు తుఫాను ఎంత వేగంతో ప్రయాణిస్తుంది....ఎటువైపు వెళుతుంది అనే విషయాన్ని విశ్లేషించి అందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. నష్టం జరిగిన తరువాత స్పందించడం కాదు....నష్టం తగ్గించేలా అధికారుల పనితీరు ఉండాలన్నారు.  హుద్ హుద్ తుఫాను సమయంలో అనుసరించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను నేడు పాటించాలని అధికారులకు సూచించారు.


టెలీకాన్ఫరెన్స్ లో అధికారులు, ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు :-
వర్షాలు తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కొన్ని చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది..రేపు కూడా వర్షాలు పడతాయని తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్లు....కాస్త తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలకు రూ.2 కోట్లు చొప్పున నిధుల విడుదల చేస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు తక్షణ చర్యలకు దిగాల్సిన అవసరం ఉంది. ప్రోక్లెయినర్లు పెట్టి నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను తొలగించాలన్నారు. నీటి ప్రవాహాలకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను యుద్దప్రాతిపదికన తొలగించి నీరు బయటకు వెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఓపెన్ డ్రైన్స్ లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది....ఇలాంటి ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయాలన్నారు.  


బుడమేరులో నీటి ఉదృతి 
బుడమేరులో నీటి ఉదృతి తీవ్రంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులు చంద్రబాబుకు తెలిపారు. బుడమేరు ఆక్రమణ వల్ల వరద సమయంలో సమస్యలు వస్తున్నాయని అధికారులు వివరించగా సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళికతో రావాలని సీఎం అన్నారు. వరద ప్రాంతాల్లో, వాగులపై వాహనదారులను అనుమతి ఇవ్వవద్దన్నారు. ఈ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న వంతెనలపై రాకపోకలు నిలిపివేయాలన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి పంటకాలువలకు నీటి విడుదల నిలపివేసినట్లు అధికారులు తెలిపారు.  విజయవాడ నగరంలో రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపేందుకు తీసుకుంటున్న చర్యలను గురించి చంద్రబాబుకు అధికారులు వివరించారు. భారీ వర్షాలు, గాలుల వల్ల తీగలు తెగి విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున....కరెంట్ సమస్యలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు స్పందించాలన్నారు. 


కనకదుర్గ టెంపుల్ లో ప్రమాదం 
కనకదుర్గ టెంపుల్ లో జరిగిన ప్రమాదం పై సీఎం  చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కొండ ప్రాంతాల్లో ఉన్నవారిని అవసరం అయితే ఖాళీ చేయించాలన్నారు. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటించాలని కోరారు.  పంట కాలువల్లో, డ్రైన్ లలో నీటి ప్రవాహాలకు అడ్డులేకుండా చూడాలన్నారు. సైక్లోన్ షెల్టర్స్ ను సిద్ధం చేసి పునరావాసం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గర్భిణుల వివరాలు సేకరించి...అవసరమైన సాయం అందించేందుకు సిద్దంగా ఉండాలన్నారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా, ప్రభుత్వ శాఖల ద్వారా క్షణక్షణం ప్రతి సమాచారాన్ని తెలుసుకుంటున్నా....అధికారుల అలసత్వం కనిపిస్తే సహించేది లేదన్నారు. పెదకాకాని ఉప్పలపాడు వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందిన ఘటనపై అధికారులను వివరణ కోరిన సిఎం.. పాఠశాలకు సెలవు ఇవ్వలేదా అని అధికారులను ప్రశ్నించారు.  వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ముందు రోజే సెలవుపై ప్రకటన చేయాలన్నారు.