Mangalagiri Police Request To People: వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, మన్యం, అల్లూరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలోని (Vijayawada) ప్రధాన రహదారులన్నీ నీట మునిగాయి. అటు, మంగళగిరి (Mangalagiri) కాజా టోల్ గేట్ వద్ద జాతీయ రహదారి చెరువును తలపిస్తోంది. హైవేపై 3 అడుగుల మేర వరద పోటెత్తుతుండగా.. ప్రజలు బయటకు రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి ఉందని.. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని స్పష్టం చేశారు. అటు, భారీ వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. వీరులపాడులో అత్యధికంగా 21 సెం.మీ, కంచికచర్ల 20.3, ఇబ్రహీంపట్నం 15.3, నందిగామ 13.8, విజయవాడ 13.5, గంపలగూడెం 13.1, చందర్లపాడు 11, జగ్గయ్యపేట, విసన్నపేటలో 8.3 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


భారీ వర్షాలతో విజయవాడ, గుంటూరు నగరాల్లోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్‌లో రహదారులు జలమయం కాగా.. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల మోకాళ్ల లోతు నీరు చేరి ప్రజల బాధ వర్ణనాతీతం. విజయవాడ బస్టాండ్ పరిసరాలు నీట మునగ్గా బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్‌ను తాత్కాలికంగా మూసేశారు. గడిచిన 24 గంటల్లో మచిలీపట్నం 19 సెం.మీ, విజయవాడ 18, గుడివాడ 17, కైకలూరు 15, నర్సాపురం 14, అమరావతి 13, మంగళగిరి 11, నందిగామ, భీమవరం 10, పాలకొల్లు, తెనాలిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.


వర్షాలతో తీవ్ర విషాదం


భారీ వర్షాలతో విజయవాడలోని మొగల్రాజపురంలో కొండ చరియలు విరిగి పడి నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అటు, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోగా.. ఈ ప్రమాదంలో ఒక టీచర్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో ఇద్దరు పిల్లలను టీచర్ తీసుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సాయంతో కారుతో పాటు మృతదేహాలను వెలికితీశారు.


అప్రమత్తమైన ప్రభుత్వం


భారీ వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ధేశించారు. తుపాను తీరం దాటే సమయంలో 55 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలపగా.. స్పష్టమైన అంచనాలతో సన్నద్ధంగా ఉండాలని అన్నారు. నష్టం తగ్గించేలా అధికారుల పని తీరు ఉండాలని స్పష్టం చేశారు. 'పట్టణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో అధికారులు తక్షణ చర్యలకు దిగాలి. ప్రొక్లెయినర్లు పెట్టి నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను తొలగించి నీరు బయటకు వెళ్లేలా చూడాలి. ఓపెన్ డ్రైన్స్‌లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయాలి. అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలి.' అని పేర్కొన్నారు.


Also Read: Vijayawada Rains: కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి, ఒక్కో ఫ్యామిలీకి రూ.5 లక్షల చొప్పున పరిహారం