AP Rains News Updates | అమరావతి: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో బోలెం లక్ష్మీ,మేఘన, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు మృతిచెందడం తెలిసిందే. సీఎం చంద్రబాబు సహాయక చర్యలపై అధికారులతో ఇదివరకే మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. దీనిపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో.. అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కోరారు. వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అధికారుల సూచనలు తప్పక పాటించాలని చంద్రబాబు కోరారు.
భారీ వర్షాలతో విజయవాడలో విషాదం
భారీ వర్షాలతో విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. కుంభవృష్టి వర్షాలతో కొండచరియలు విరిగి సమీపంలోని ఇళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల సైతం కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్నిచోట్ల రోడ్లు నీట మునగడంతో రాకపోకలకు సైతం ఇబ్బంది తలెత్తింది. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతానికి వెళ్లి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ కొండచరియలు విరిగిపడటంతో ఓ ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, మరో 3 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
వర్షాలపై చంద్రబాబు సమీక్ష
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు శనివారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలో విషాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని, డ్రైనేజీలలో నీరు ఇళ్లల్లోకి రాకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.