ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ ఉద్యోగులు ఆగస్టు 17న ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారికి విజయవాడ సీపీ కాంతిరాణా టాటా షాక్ ఇచ్చారు. 17న ‘చలో విజయవాడ’కు విద్యుత్‌ ఉద్యోగుల పోరాట కమిటీ పిలుపునివ్వగా.. దానికి అనుమతిలేదని విజయవాడ సీపీ తేల్చిచెప్పారు. పోలీసుల అనుమతి లేనందున ఎవరైనా ఆ కార్యక్రమానికి హాజరైతే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్మా చట్టం (Essential Services Maintenance Act) ప్రకారం చర్యలు చేపడతామని అన్నారు. విజయవాడలో సీపీ మీడియాతో మాట్లాడారు.


ఆగస్టు 17న విజయవాడలో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంటాయని సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు. విజయవాడలోని విద్యుత్‌ సౌధ, బీఆర్టీఎస్‌ రోడ్డు ప్రాంతాల్లో ప్రత్యేక సీసీటీవీ కెమెరాలతో నిఘాలో ఉంటాయని అన్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. అయితే, ఛలో విజయవాడకు రావద్దని విద్యుత్‌ సంఘ నేతలకు ఇప్పటికే నోటీసులు కూడా అందించామని చెప్పారు. వాటిని బేఖాతరు చేస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయని వివరించారు.


విద్యుత్తు ఉద్యోగులు తలపెట్టిన మహాధర్నాతో బహిరంగ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్యోగ సంఘాలు వర్క్‌ టు రూల్‌ పాటించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు విద్యుత్తు సంస్థల యాజమాన్యానికి సోమవారం విద్యుత్తు ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే నిరవధిక సమ్మకు దిగాలని ఉద్యోగులు భావిస్తున్నరు